Saturday, November 23, 2024

కనుసన్నల్లోనే ‘రేషన్’…!

- Advertisement -
- Advertisement -

ఇకపై ఐరిష్, ఒటిపి విధానాలకే సరుకులు
హైకోర్టు సూచనలతో కొత్తపద్దతుల్లో పంపిణీ
కరోనా మహమ్మారితోనే సరికొత్త విధానాలు
ఈనెల పంపిణీతోనే నూతన విధానం ప్రారంభం

 

మన తెలంగాణ/నల్లగొండ: కరోనా మహమ్మారి నేపథ్యంలోనే ప్రభుత్వ చౌకధర దుకాణాల్లో సరుకుల పంపిణీ విధానాల్లో ఎప్పటికప్పుడు కొత్తవిధానాలకు శ్రీకారం చుడుతూ వస్తుంది. ఇప్పటి వరకు రేషన్ సరుకులు వేలిముద్ర వేయడం ద్వారా పొందుతున్న విషయం తెలిసిందే. అయితే బయోమెట్రిక్ విధానంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై ఐరిష్‌తో పాటు ఒటిపి విధానంలో బియ్యం పంపిణీ జరుగనుంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 9లక్షల 61వేల 354 రేషన్‌కార్డులుండగా ఇప్పటి వరకు జరిగిన బయోమెట్రిక్ విధానంలో రేషన్ పంపిణీ జరిగేది. ఇందులో సుమారుగా 3లక్షల పైచిలుకు కార్డుదారులు ఇప్పటికీ ఆధార్‌కు అనుసంధానం చేసుకోలేదనేది అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలో 4లక్షల 54వేల 019 కార్డులకు గాను రమారమిగా లక్షా 50వేలు, సూర్యాపేట జిల్లాలో 3లక్షల 7వేల 50లకు గాను లక్ష పైచిలుకు, ఇక యాదాధ్రి భువనగిరి జిల్లాలో 2లక్షల 285కార్డులకు గాను దాదాపు 80వేల వరకు కార్డుదారులు ఈనెలలోనే అనుంధానం చేసుకుంటేనే వారికి రేషన్ అందనుంది. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఈనెల బియ్యం పంపిణీతోనే సరికొత్తగా ఐరిష్, ఓటిపి విధానాలు అమలులోకి రానున్నాయి. ఫిబ్రవరి మాసం సరుకుల పంపిణీతోనే పాత విధానానికి స్వస్తి పలికి సరికొత్త విధాలైన ఐరిష్, ఓటిపి విధానాలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈనెల నుంచే లబ్దిదారులకు సరికొత్త విధానంలో సరుకులు అందనున్నాయి.

చౌకధర దుకాణాల్లో ఒకే బయోమెట్రిక్ యంత్రం వినియోగించడంతో కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ప్రభుత్వం విఆర్‌వో, విఆర్‌ఎ ల దృవీకరణతో బియ్యం పంపిణీ జరిపిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ యావత్తు కరోనా విజృంభిస్తున్న సమయంలో ఏప్రిల్ మాసం నుంచి సెప్టెంబర్ మాసం వరకు ఆరుమాసాలు పాటు కొనసాగగా అక్టోబర్ మాసం నుంచి వేలిముద్ర వేసి బియ్యం పొందే పాత విధానానికే ప్రభుత్వం మొగ్గుచూపింది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఐరిష్, ఒటిపి విధానం ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో కార్డుదారులు తమ చరవాణి సంఖ్యను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

నేటి నుంచే సరికొత్త విధానాల్లో….ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీకి సంబందించి ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి నెలకు సంబందించి బియ్యం చౌకధర దుకాణాల్లో ఉన్నటువంటి పివోఎస్ యంత్రంలో కార్డు నెంబర్ నమోదు చేస్తే ఆధారతో అనుసంధానమైన చరవాణికి ఓటిపి వచ్చిన వెంటనే డీలర్‌లు సరుకులు అందజేస్తారు.

వృద్దులకు తొలుత కొంత ఇబ్బందే….రేషన్ సరకులు బయోమెట్రిక్ విధానం ద్వారా ఇప్పటి వరకు పొందుతున్న వృద్దులకు సరికొత్త ఓటిపి విధానంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఈనెల నుంచి రేషన్ సరుకుల పొందాలంటే సెల్‌ఫోన్ అవసరముంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది వృద్దులకు ఫోన్‌వాడకంలో అంతగా అనుభవం లేనందున వారందరికి ఓటిపి విధానంతో కొంతమేర ఇబ్బందులు ఉంటాయని పలువురు డీలర్‌లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఫోన్ వాడుతున్నవారైతే చాలామంది మొబైల్‌కు ఆధార్ అనుసంధానం చేయించడానికి మీ సేవ కేంద్రాల గంటల కొద్ది వేచిఉండాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్న అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. అయితే మొబైల్ అనుసంధానం లేని వారంతా త్వరితగతిన నెంబర్‌కు అనుసంధానం చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News