Friday, December 20, 2024

కోట్ల పేదలకు రేషన్ పరేషాన్

- Advertisement -
- Advertisement -

ఆహార భద్రతలో భాగంగా దేశవ్యాప్తంగా ఉచితంగా బియ్యం/ ఆహార ధాన్యాలు అందించేందుకు ఉద్దేశించిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై)తో పాటు సంబంధిత పథకాలను కేంద్రం 2028 డిసెంబర్ వరకు పొడిగించింది. ఈ మేరకు తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటి కోసం రూ. 17,082 కోట్లు ఖర్చు చేయడానికి నిర్ణయించారు. ఈ నిర్ణయం ఎంతో ఆశలు కలిగిస్తోంది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలిస్తే దేశంలోని రేషన్ కార్డులేని పేదలు దాదాపు 8 కోట్ల మంది ఉన్నారు. గత కొన్నేళ్లుగా వీరికి రేషన్ కార్డులు లేక ప్రజాపంపిణీ వ్యవస్థ కింద ఎలాంటి ఆహార ధాన్యాలు సరఫరా కావడం లేదు. ఈ నేపథ్యంలో ఈనెల (అక్టోబర్)4న దాఖలైన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

అంతేకాదు రేషన్ కార్డుల జారీకి చివరి అవకాశంగా నవంబర్ 19వ తేదీ వరకు సమయం ఇస్తున్నామని గడవు విధించడం గమనార్హం. దీన్ని బట్టి పేదలకు రేషన్ సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు శ్రద్ధ వహిస్తోందో తేటతెల్లమవుతోంది. గత ఆగస్టులో జరిగిన వ్యవసాయ ఆర్థిక వేత్తల జాతీయ సదస్సులో ప్రధాని మోడీ దేశంలో అవసరానికి మించి ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని గొప్పగా ప్రకటించా రు. మరి అలాంటప్పుడు 8 కోట్ల మందికి ఎందుకు రేషన్ సరఫరా చేసే చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్న ఎదురవుతోంది. ప్రపంచ ఆకలి సూచికలో భారత్ స్థానం రానురానూ దిగజారుతోందన్న వాస్తవం సర్వేల ద్వారా బయటపడుతోంది. 2016లో 97వ స్థానంలో ఉన్న భారత్, 2023లో 111వ స్థానానికి (మొత్తం దేశాలు 125) పడిపోయింది.

2021లో నిర్వహించిన ఓ సర్వేలో దేశంలో 74.1% మందికి ఆరోగ్యకరమైన ఆహారం లభించడం లేదని తేలింది. ఈ పరిస్థితుల్లో ఆహారధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ప్రకటించుకోవడంలో ప్రయోజనం ఏముందో అర్థం కావడం లేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రచార సభల్లో ప్రధాని మోడీ తమ ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ అందిస్తున్నట్టు పదేపదే ప్రకటించారు. కానీ వాస్తవాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. దేశంలోని 8 కోట్ల మంది పేదలకు రేషన్‌కార్డులు లేవని గత సంవత్సరం ఆగస్టులో సుప్రీం కోర్టుకు కేంద్రం విన్నవించింది. దీన్ని బట్టి పిఎంజికెఎవై పథకంలో ఈ ఎనిమిది కోట్ల మంది లేరని, వారికి రేషన్ అందడం లేదని స్పష్టమవుతోంది. 2013వ సంవత్సరపు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశ జనాభాలో మూడింట రెండొంతుల (67%) మందికి ప్రయోజనం చేకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా గ్రామీణ జనాభాలో 75% మందికి, పట్టణ జనాభాలో 50% మందికి సబ్సిడీపై ఆహార ధాన్యాలు సరఫరా చేయాలన్నది ప్రభుత్వ లక్షం.

కానీ ఈ మేరకు చర్యలు మాత్రం కనిపించడం లేదు.2020లో కొవిడ్ మహమ్మారి విజృంభించిన గడ్డు పరిస్థితిలో పిఎంజికెఎవై పథకం కింద అదనంగా ఐదు కిలోల ఆహార ధాన్యాలను ప్రజాపంపిణీ లబ్ధిదారులకు అందజేశారు. అయితే 2023 జనవరి నుంచి ఉచిత పంపిణీ ఆగిపోయింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఒక్కో వ్యక్తికి గతంలో సబ్సిడీ రేటుపై ఇచ్చే ఐదు కిలోలనే ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు. ఈ పథకాన్ని సవరించి ఈ ఏడాది జనవరి నుంచి మరో ఐదు సంవత్సరాలు పొడిగించారు. అయితే 2011లో సేకరించిన జనాభా లెక్కల ఆధారం గానే ప్రస్తుత ప్రజాపంపిణీ వ్యవస్థ కోటా నిర్ణయమవుతోంది. ఫలితంగా అనేక మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నా పొందలేకపోతున్నారు. 2011నాటి జనాభా లెక్కలబట్టి కాకుండా ప్రస్తుత జనాభాను గణించి ఆ మేరకు రేషన్ కోటా పెంచాలని సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. అయినా నిమ్మకునీరెత్తినట్టు కేంద్రంలో ఎలాంటి కదలికలు కనిపించడం లేదు.

గత జులైలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరిని సుప్రీంకోర్టు తూర్పారబట్టింది. ఉదాహరణకు కర్ణాటకలో 1.45 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులు రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తుంటే ఇప్పటి వరకు కేవలం 13,945 కార్డులు మాత్రమే జారీ కావడం గమనార్హం. ఇదిలా ఉండగా రేషన్ కార్డులు పొందాలంటే అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం రేషన్ కార్డులున్న 81 కోట్ల మంది ఈకెవైసి ద్వారా బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం ఇటీవలనే ఆదేశాలు జారీ చేసింది. 99.8% రేషన్ కార్డులు ఇప్పటికే ఆధార్‌తో అనుసంధానమైనప్పుడు ఈ కెవైసి అవసరం ఏముంటుంది అన్నదే ప్రశ్న. ఈ కెవైసిని పూర్తి చేయకపోతే రేషన్ కార్డులు రద్దవుతాయని చౌక డిపోల నుంచి లబ్ధిదారులకు హెచ్చరికలు అందుతున్నాయి. ఒకవైపు జనాభా గణనను వాయిదా వేయడమే కాకుండా సుప్రీం కోర్టు తీవ్రంగా హెచ్చరించినా కోట్ల మంది పేదలకు రేషన్ అందించడానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనతకు ప్రత్యక్ష నిదర్శనం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News