హైదరాబాద్ : నగర పేదలకు ఆహార భద్రత కార్డులోని ప్రతి కుటుంబ సభ్యుడికి ఇక నుంచి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. కరోనా తరువాత పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆకలి బాధలు పడవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2022 డిసెంబర్ వరకు ఉచితంగా 10 కిలోల చొప్పున రేషన్ దుకాణాలు అందజేసింది. 2023 సంవత్సరమంతా కొనసాగించాలని కేంద్రం ప్రకటన చేసిన, రాష్ట్ర వాటా కేటాయించలేదు. దీంతో మూడు నెలలుగా ఐదు కిలోలు మాత్రమే ఉచిత రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. ఈనెల నుంచి రాష్ట్ర వాటాగా ఒక కిలో కలిపి ప్రతి నెలా ఆరు కేజీల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారులు పేర్కొంటున్నారు. అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు బియ్యం, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోల చొప్పున చౌక ధరల దుకాణాల్లో పంపిణీ చేస్తున్నట్లు గోధుమలు కిలో రూ. 7 ప్రతి కార్డుదారులకు గరిష్టంగా 5 కిలోలు, చక్కర కిలో రూ. 13.50 చొప్పున ప్రతి అంత్యోదయ కార్డుదారులకు పంపిణీ చేస్తామని, లబ్దిదారులు రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి సరుకులు తీసుకోవాలని కోరారు.
ఇప్పటికే రేషన్ దుకాణాలకు అదనపు కోటా సరఫరా చేశామని అర్హులైన వారందరూ తీసుకుంటే ఈనెల 15వ తేదీలోగా పంపిణీ పూర్తి అవుతుందని, ఎవరైనా తీసుకోకుంటే గడువు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతి ఒకరికి ఆరు కిలోల బియ్యం పంపిణీ సక్రమంగా పంపిణీ చేస్తున్నారో వివరాలు తెలుసుకునేందుకు రేషనింగ్ ఇన్‌స్పెక్టర్లు, విజిలెన్స్ బృందాలు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో 6,10,866 ఆహార భద్రత కార్డులు, రంగారెడ్డి 6, 55, 957 కార్డులు, మేడ్చల్ జిల్లాలో 5,24, 594 కార్డులకు ప్రతి నెలా ఉచిత బియ్యం రేషన్ డీలర్లు పంపిణీ చేస్తున్నారు. కరోనా వైరస్ భారిన పడి చనిపోయిన డీలర్ల స్దానంలో కొత్తవారిని నియమించకపోవడంతో ప్రతినెలా 800లకు పైగా కార్డులకు సరుకులు పంపిణీ చేయడం భారంగా మారిందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తీలు, కాలనీల్లో కొంతమంది దళారులు ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యం కొనుగోలు చేస్తూ అమాయక ప్రజలను మోసం చేసి సొమ్ము చేసుకుంటారని వారిపట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.