రౌల్ రిటైర్మెంట్..క్లిష్టతల నడుమ నేత ఎవరో
హవానా : అమెరికాకు చిరకాలపు ప్రత్యర్థిదేశం క్యూబాలో కాస్ట్రోల శకం ముగిసింది. తాను క్యూబా కమ్యూనిస్టు పార్టీ నేత పదవి నుంచి వైదొలుగుతున్నట్లు రౌల్ కాస్ట్రో శనివారం ప్రకటించారు. దీనితో ఈ కమ్యూనిస్టు ఏలుబడుల దేశంలో ఆరు దశాబ్ధాల పైబడి సాగుతోన్న కాస్ట్రో సారధ్యపు పాలన వ్యవహారం సమసిపోతోంది. ఇక ఎంతోకాలం తాము నాయకత్వ బాధ్యతల్లో ఉండలేనని, పార్టీ పగ్గాలను నూతన యువ నాయకత్వానికి అప్పగిస్తానని 89 సంవత్సరాల రౌల్ కాస్ట్రో ప్రకటించారు. క్యూబాలో అధికార క్యూబన్ కమ్యూనిస్టు పార్టీ ఎనిమిదవ మహాసభను ఉద్ధేశించి రౌల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తన పదవీ నిష్క్రమణ ప్రకటన వెలువరించారు. తనకు ఇంతకాలం అప్పగించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా నిర్వర్తించినట్లు బావిస్తున్నట్లు ,తన సేవలతో పితృదేశానికి రుణం తీర్చుకున్నట్లుగా భావిస్తున్నానని తెలిపారు. 1959 క్యూబా విప్లవం నాటి నుంచి క్యూబాలో కాస్ట్రోల అధికారిక హయాం సాగుతూ వస్తోంది.
ఆయన సోదరుడు ఫైడెల్ కాస్ట్రో 2016లో మరణించిన తరువాత రౌల్ కాస్ట్రో బాధ్యతలు చేపట్టారు. కమ్యూనిస్టు పార్టీ నేతగా తన వారసుడు ఎవరనేది రౌల్ ప్రస్తావించలేదు. అయితే ఇంతకు ముందు పలుసార్లు తన తరువాతి దశలో 60 సంవత్సరాల మిగ్యూల్ డియాజ్ కెనెల్ బాధ్యతలు తీసుకుంటారని చెపుతూ వచ్చారు. నాయకత్వ భర్తీ అనేది ఓ నిరంతర ప్రక్రియ అవుతుందని దేశంలో వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. యువతరం కోసం పాత తరం వైదొలగాల్సి ఉంటుందని చెపుతున్నారని, అయితే కాస్ట్రోలే తెరవెనుక నాయకులుగా ఉంటారని భావించాల్సి ఉంటుందని దేశవాసి ఒకరు వ్యాఖ్యానించారు. క్యూబా క్లిష్టతర పరిస్థితుల నడుమనే అధికార పార్ఠీ నాయకత్వ మార్పిడి జరుగుతోంది. ఇక ముందు ఏమి జరుగుతుందో అనే భయాలు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి, ఆర్థిక సంస్కరణలతో తలెత్తిన చిక్కులు, ట్రంప్ అధికార యంత్రాంగపు ఆర్థిక ఆంక్షలతో ఏర్పడ్డ ఆర్థిక దుస్థితి ,పర్యాటక పతనావస్థ, చెల్లింపుల భారాల నడుమ దేశ సారధ్య చిక్కుముడి ఏర్పడుతోంది.
ఆర్థిక అసమానతలు, సామాజిక మాధ్యమంతో విభిన్న వర్గాల మధ్య అసమ్మతి పరాకాష్టకు చేరడం వంటి పరిణామాలు ఇప్పుడు క్యూబాను బాధిస్తున్నాయి. కాస్ట్రోల సంస్కరణలతో దేశ ఆర్థిక పరిస్థితిలో సరైన మార్పులు సత్వరరీతిలో ఏర్పడలేదనే అసంతృప్తి ఉంది. ఇప్పుడు జరుగుతున్న పార్టీ మహాసభలలో పలు కీలక విషయాలు ప్రస్తావనకు వస్తాయని భావిస్తున్నారు. నాయకత్వ మార్పు పరిణామం కాస్ట్రోల రహిత అధికారిక వ్యవస్థకు దారితీయడం కీలక పరిణామం అయింది. తాను నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగడంలో ఎటువంటి ఒత్తిళ్లు లేనేలేవని రౌల్ కాస్ట్రో తేల్చితేల్చిచెప్పారు. అన్ని సావధానంగా ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీ అంతర్గత సమావేశంలో కాస్ట్రో చేసిన ప్రసంగం అధికారిక టీవీల్లో ప్రసారం అయింది. తాను బతికి ఉన్నంత వరకూ తాను ఈ దేశం కోసం పాటుపడుతూ ఉంటానని, పుట్టిన దేశం, ఇక్కడి విప్లవం, సోషలిజం పరిరక్షణకు మునుపటి కన్నా శక్తివంతంగా తోడ్పాటు అందిస్తానని రౌల్ తెలిపారు. నాలుగురోజుల పాటు జరిగే కమ్యూనిస్టు పార్టీ సభలలో పార్టీ తదుపరి నేత ఎవరనేదానిపై తర్జనభర్జనలు జరుగుతాయి. తరువాత నేత ఎవరనేది ప్రకటిస్తారు.