Monday, December 23, 2024

మేడిగడ్డ పాపాలకు మామా అల్లుళ్లు కారణం కాదా?: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు పుర్రెలో పురుగు పుట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చురకలంటించారు. నీటిపారుదల రంగం శ్వేతపత్రంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా రేవంత్ ప్రసంగించారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ కు ఏ దేవుడు కలలోకి వచ్చి చెప్పారో తెలియదని, ఆయనే ఇంజనీర్లకు సలహా ఇచ్చారని, తుమ్మిడిహెట్టి దగ్గరే ప్రాజెక్టు నిర్మించాలని వారు నియమించిన ఇంజనీర్ల కమిటీ స్పష్టం చేసిందని, మేడిగడ్డ వద్ద నిర్మిస్తే నిరూపయోగమని ఐదుగురు ఇంజనీర్ల కమిటీ తేల్చేసిందన్నారు. ఈ నివేదికను తొక్కిపెట్టి మామా అల్లుళ్లు ప్రాజెక్టు నిర్మించారని దుయ్యబట్టారు.

ఇదే విషయాన్ని తొమ్మిదేళ్ల క్రితం మేడిగడ్డ మేడిపండేనా అని పత్రిక సాక్షి పత్రికలో రాశారని, తెలంగాణ ఖాజానాను కొల్లగొట్టేందుకు ఇంత దుర్మార్గానికి తెగపడుతారా? అని పశ్నించారు. కెసిఆర్, హరీష్ కలిసి రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో వాళ్లు తెలుసుకోవాలని, కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు… కాళేశ్వరం తెలంగాణకు ఒక కళంకంగా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా? అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు పగిలిపోతుంటే క్షమాపణలు చెప్పకుండా.. ఇంకా వాదిస్తారా? అని, హరీష్ రావును తాను నిలదిస్తున్నా.. ఈ దుర్మార్గాలకు కారణం మీరు కాదా? ముక్కుసూటిగా రేవంత్ రెడ్డి అడిగారు.

ఈ పాపాలకు మామా అల్లుళ్లు కారణం కాదా?, ఇలాంటి పరిస్థితుల్లో మొండి వాదనలు… తొండి వాదనలు వద్దు హరీష్ రావు అని సూచించారు. మీరు నియమించిన అధికారుల నివేదికనే మీరు తప్పు పడతారా? అని ధుయ్యబట్టారు. చేవెళ్లలో ప్రాజెక్టు ఆపితే ఆనాడు ధర్నా చేసిన మా అక్క ఇప్పుడు వారి పక్కనే ఉందని, ఆనాడు దీక్షలు, ధర్నాలు చేసిన సబితక్క.. ఈనాడు హరీష్ రావుని సమర్ధిస్తున్నారా? అని ప్రశ్నించారు. జరిగిన తప్పులకు హరీష్ క్షమాపణ చెప్పి, సిట్టింగ్ జడ్జి విచారణకు వచ్చినపుడు ఎవరి ఒత్తిడితో ఇలా చేశారో కన్ఫెక్షన్ స్టేట్ మెంట్ ఇచ్చి ఒప్పుకోవాలని,  కానీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బిఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని,  జరిగిన తప్పులకు క్షమాపణలు చెప్పి సహకరిస్తే హరీష్ కు గౌరవం ఉండేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

మాట్లాడితే గతంలో గతంలో అని మాట్లాడుతున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన విషయాలను బిఆర్ఎస్ వాళ్లకు గుర్తు చేస్తున్నామని,  ప్రాణహిత చేవెళ్లకు అడ్డంకులను తొలగించేందుకు మహారాష్ట్ర సిఎంతో  ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ఎపి సిఎం చర్చించారని తెలియజేశారు.  గోదావరి ప్రాజెక్టులపై రిటైర్డ్ ఇంజనీర్లతో ఆనాటి సిఎం కెసిఆర్, ఆనాటి మంత్రి హరీష్ రావు ఒక కమిటీ వేశారని, ఐదుగురు సభ్యుల కమిటీ 14పేజీల నివేదిక ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 2012లో స్టాండింగ్, కో-ఆర్డినేషన్ కమిటీలను వేశారని, ఆనాడు ప్రాణహిత వల్ల మహారాష్ట్రలో ముంపుకు గురయ్యేది 1850 ఎకరాల పట్టా భూములు మాత్రమేనని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News