న్యూఢిల్లీ: ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న లోక్‌సభ టివి, రాజ్యసభ టివిలను సంసద్ టివి పేరుతో ఒకే చానల్‌గా మార్చే ప్రక్రియకు ఉభయ సభల సభాధ్యక్షులు శ్రీకారం చుట్టారు. సంసద్ టివి మొట్టమొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మాజీ ఐఎఎస్ అధికారి రవి కపూర్ మంగళవారం నియమితులయ్యారు. మార్చి 1వ తేదీ నుంచి ఏడాది పాటు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని లోక్‌సభ సచివాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
రాజ్యసభ టివి, లోక్‌సభ టివిలను సంసద్ టెలివిజన్‌లో విలీనం చేసేందుకు రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్ అంగీకరించిన దరిమిలా కాంట్రాక్ట్ పద్ధతిలో సంసద్ టివి సిఇఓగా రవి కపూర్‌ను నియమిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం తెలిపింది. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొంది. సంసద్ టివిలో ఈ రెండు చానళ్లు విలీనం అయినప్పటికీ లోక్ సభ, రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలను వేర్వేరుడి ఇవి ప్రసారం చేస్తాయని వర్గాలు తెలిపాయి.