వాషింగ్టన్ : అమెరికా వైమానిక దళం భద్రతా వ్యవహారాల విభాగంలో భారతీయ సంతతి వ్యక్తికి అత్యున్నత స్థానం దక్కింది. ఇప్పటివరకూ ఫ్లెయిట్ టెస్ట్ ఇంజనీరుగా ఉన్న రవిచౌదరిని ఎయిర్‌ఫోర్స్‌లో డిఫెన్స్ అసిస్టెంట్ సెక్రెటరీగా ఎంపికచేస్తూ బైడెన్ అధికార యంత్రాంగం చేసిన ప్రతిపాదనకు అమెరికా సెనెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. సెనెట్‌లో రవిచౌదరికి అనుకూలంగా 65 ఓట్లు, వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. అమెరికాలో అత్యంత కీలకమైన భద్రతా వ్యవహారాల సంస్థ పెంటగాన్ పరిధిలోకి వచ్చే ఎయిర్‌ఫోర్స్‌లో అసిస్టెంట్ సెక్రెటరీ స్థానం అత్యున్నత స్థాయిలో నిలిచే పౌరహోదాగా నిలుస్తుంది. ఇప్పుడు అమెరికా పెద్దల సభలో జరిగిన ఓటింగ్‌లో డజన్ మందికి పైగా ప్రతిపక్షరిపబ్లికన్లే ఆయనకు అనుకూల ఓటేశారు. 1993 నుంచి 2015 వరకూ రవిచౌదరి వివిధరకాల స్థాయిలలో వ్యవహరించారు.
తొలిదశలో సి 17 పైలెట్ బాధ్యతల్లో ఉన్నప్పుడు రవిచౌదరి అమెరికా తరఫున పలు ప్రపంచ స్థాయి వైమానిక మిషన్లల్లో పాల్గొన్నారు. అఫ్ఘనిస్థాన్, ఇరాక్‌లలో పలు సార్లు అమెరికా యుద్ధ విమానాల ద్వారా దాడుల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. నిర్వాహక బాధ్యతలతో పాటు, ఇంజనీరింగ్, సీనియర్ స్టాఫ్ నియామకాలలో ప్రధాన పాత్ర పోషించారు. ఫ్లెయిట్ టెస్ట్ ఇంజనీరుగా సైనిక విమానాల సమర్థత, ప్రమాణికతల దిశలో కీలక చర్యలు చేపట్టారు. ఎయిర్‌ఫోర్సు ఆధునీకరణ కార్యక్రమాలకు అవసరం అయిన హార్డ్‌వేర్ రూపకల్పనతో యుద్ధ విమానాల సమర్థత, భద్రతకు పాటుపడ్డారు. తనకున్న సాంకేతిక ప్రతిభతో ఆయన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సారధ్యపు అంతరిక్ష కేంద్రం పరిరక్షణ కార్యకలాపాలకు సహకరించారు. తద్వారా నాసా వ్యోమగాముల భద్రతకు తగు చర్యలు చేపట్టారు.