సిటిబ్యూరోః తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా రవిగుప్తాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే డిజిపి అంజనీకుమార్, ఎడిజిలు మహేష్ భగవత్, సంజయ్‌కుమార్ జైన్ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల లెక్కింపు జరుగుతుండగా, కోడ్ అమలులో ఉన్న సమయంలో ఓ పార్టీ నాయకుడిని డిజిపి అంజనీకుమార్ కలవడంపై ఈసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేసింది.
అడిషనల్ డిజిలు మహేష్ భవత్, సంజయ్‌కుమార్ జైన్‌కు వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. దీంతో ఖాళీ ఏర్పడిన డిజిపి పోస్టుకు లిస్టు పంపించాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరగా తెలంగాణ రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ శాంతికుమారి ముగ్గురు సీనియర్ పోలీస్ అధికారుల పేర్లు పంపించగా, అందులో నుంచి రవిగుప్తాను డిజిపిగా ఎంపిక చేసింది. దీంతో ఛీఫ్ సెక్రటరీ శాంతికుమారి రవిగుప్తాను డిజిపి నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రవిగుప్తా ఎసిబి(యాంటి కరెప్షన్ బ్యూరో) డిజిగా కొనసాగుతున్నారు.