ముంబై: టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేయడాన్ని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్వాగతించాడు. జట్టును విజయపథంలో నడిపించే సత్తా రోహిత్‌కు ఉందన్నాడు. అయితే విపరీత పోటీ ఉండే అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్సీ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించడం అనుకున్నంత తేలికకాదన్నాడు. ఐపిఎల్‌తో పోల్చితే అంతర్జాతీయ క్రికెట్ భిన్నమైందనే విషయాన్ని మరువ కూడదన్నాడు. ఇక జట్టులోని ప్రతి ఆటగాడిని కలుపుకుని పోవాల్సిన బాధ్యత రోహిత్‌పై ఉందన్నాడు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలంటే ప్రతి ఆటగాడి సహకారం కెప్టెన్‌కు ఎంతో అవసరమన్నాడు. జట్టులోని ప్రతి క్రికెటర్ సేవలను సమర్థంగా ఉపయోగించుకోవాలన్నాడు. ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు పలుసార్లు విజేతగా నిలిపిన ఘనత రోహిత్‌కు ఉందన్నాడు.
ఇది అతనికి కలిసివచ్చే అంశమన్నాడు.టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడం రోహిత్‌కు ఇదే తొలిసారి కాదనే, ఇప్పటికే పలుసార్లు అతను సారథ్య బాధ్యతలు చేపట్టిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ జట్టును ముందుండి నడిపించే సత్తా అతనికుందన్నాడు. ఇక రోహిత్ సారథ్యంలో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమని రవిశాస్త్రి జోస్యం చెప్పాడు.
Ravi Shastri about Rohit Sharma Captaincy