అహ్మదాబాద్: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అశ్విన్ టెస్టు కెరీర్‌లో 400వ వికెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో అతి తక్కువ టెస్టుల్లో 400 వికెట్లను అందుకున్న తొలి భారత బౌలర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. అంతేగాక శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తర్వాత అత్యంత వేగంగా 400 వికెట్లను పడగొట్టిన రెండో బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. మురళీధరన్ 72 టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అశ్విన్ 77 టెస్టుల్లో ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక, టెస్టుల్లో 400కు పైగా వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా అశ్విన్ అరుదైన రికార్డును సృష్టించాడు.
ఇప్పటి వరకు కపిల్‌దేవ్ (434), అనిల్ కుంబ్లే (619), హర్భజన్ సింగ్(417) మాత్రమే ఈ రికార్డును సాధించారు. తాజాగా అశ్విన్ కూడా ఆ దిగ్గజాల సరసన నిలిచాడు. ఇదే క్రమంలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్ వికెట్‌ను తీయడం ద్వారా అశ్విన్ మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కపిల్ దేవ్ తర్వాత ఓ బ్యాట్స్‌మన్ ఎక్కువ సార్లు ఔట్ చేసిన బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. స్టోక్స్‌ను అశ్విన్ ఇప్పటి వరకు టెస్టుల్లో 11 సార్లు ఔట్ చేశాడు. కపిల్‌దేవ్ పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ ముదస్సర్ నజర్‌ను 12 సార్లు ఔట్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇషాంత్ శర్మ కూడా ఇంగ్లండ్ ఆటగాడు అలిస్టర్ కుక్‌ను 11 సార్లు ఔట్ చేసి అశ్విన్ సరసన నిలిచాడు.
Ravichandran Ashwin take 400 wickets in Test Cricket