టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన తర్వాత జడేజా ఈ విషయాన్ని ప్రకటించే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. జడేజా ఇప్పటికే టి20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ టి20 వరల్డ్‌కప్ గెలిచిన వెంటనే జడేజా అంతర్జాతీయ టి20కి వీడ్కోలు పలికాడు. తాజాగా వన్డేల నుంచి కూడా తప్పుకోవాలని భావిస్తున్నాడు.
అయితే ఇప్పటి వరకు దీనిపై జడేజా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో జడేజా అత్యంత నిలకడైన ఆటతో అలరిస్తున్నాడు. ఆదివారం కివీస్‌తో జరిగిన ఫైనల్లో కూడా సత్తా చాటాడు. 10 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, ఫైనల్ తర్వాత అతను వన్డేల నుంచి తప్పుకుంటాడని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాతో పాటు జాతీయ టివి ఛానల్స్‌లలో కథనాలు వస్తున్నాయి.