Monday, December 23, 2024

ఆధునిక సోక్రటీస్

- Advertisement -
- Advertisement -

హేతువాద, మానవవాద, తత్వవేత్త రావిపూడి వెంకటాద్రి మరణం (తేదీ 21 జనవరి 2023) మానవాళికే తీరని లోటు. ఎందుకంటే హేతువాదం అనే ఒక్క పదంపైన ఆయన రాసినంత విస్తృతంగా, లోతుపాతులతో – వాసిలోనే కాదు, రాశిలోనూ విస్తారంగా రాసిన రచయిత, నిత్యగమనశీల కార్యకర్త వెంకటాద్రి కాకుండా ప్రపంచంలో మరెవ్వరూ లేరు. వారు హేతువాద ఉద్యమానికి మానవవాద మలుపును ఇచ్చిన తాత్వికులు. కేవలం హేతువాదం అంటే నాస్తికత్వం అని, ప్రతి విషయాన్ని నిర్దంద్వంగా వ్యతిరేకించే వారని, మూఢ నమ్మకాల నిర్మూలనకు మాత్రమే పరిమితమైనవారని అప్పటి వరకు ఉన్న అపోహలను, అపార్థాలను తొలగించడం కోసం వారు పడ్డ ‘శ్రమ’ అసామాన్యమైనది. రచయితగా, కార్యకర్తగా, ఉద్యమ సారథిగా, పబ్లిషర్‌గా ఇలా రావిపూడి వెంకటాద్రి అనేక ఇబ్బందులతో అనేకమైన బాధ్యతలు దశాబ్దాలుగా మరణానికి 20 రోజుల ముందు వరకూ నిర్వహిస్తూనే వచ్చారు.

రావిపూడి వెంకటాద్రి ఫిబ్రవరి 9, 1922 జన్మించారు. 1943 ఏప్రిల్ 5న కవిరాజాశ్రమం – నాగండ్లలో స్థాపించి, 1946 నుంచి హేతువాద మానవవాద రచయితగా, ఉపన్యాసకులుగా కొనసాగారు. 1956-96 మధ్య నాగండ్ల గ్రామ సర్పంచ్‌గా గ్రామస్థుల కోరిక మేరకు పని చేశారు.19791989 మధ్య ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘ వ్యవస్థాపక అధ్యక్షులుగానూ 1989 -2002; 2008 -2010 మధ్య భారత హేతువాద సంఘ అధ్యక్షులుగా పనిచేశారు. తానే వ్యవస్థాపకుడిగా ప్రారంభించిన మాసపత్రిక ‘హేతువాది’కి 1982 సెప్టెంబరు నుంచి 2023 జనవరి వరకు ప్రధాన సంపాదకులుగా ఉన్నారు. అంతేకాకుండా హేతువాద మానవవాద ఉద్యమానికి ఒక చిరునామా కోసం 1991లో రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్, ఇంకొల్లులో స్థాపనకు మార్గదర్శిగా నిలిచి ఉద్యమకారులకు ఒక గొడుగుగా మారారు.

1993లో అమెరికా, యూరప్‌లలో పర్యటించిన అంతర్జాతీయ హేతువాది, మానవవాది రావిపూడి వెంకటాద్రి.1993లో ‘హేమా పబ్లికేషన్స్’ స్థాపించిన ఆయన ఇప్పటి వరకు 200 పుస్తకాలు ప్రచురించారు. అందులో వంద పుస్తకాలు తనవి కావడం ఒక విశేషమైతే తోటి ఉద్యమకారులను రచనా వ్యాసంగం వైపు మళ్ళించి వారి రచనలకు అవసరమైన సూచనలు చేసి, స్వయంగా తానే ఫ్రూపులు దిద్ది పుస్తకాలు ప్రచురించడం మరో విశేషం. పేరు కోసం ప్రాకులాటలు, అవార్డుల కోసం ఆరాటం ఎంతమాత్రం లేని వెంకటాద్రికి 1996 లో కవిరాజు త్రిపురనేని ట్రస్టు నుంచి కవిరాజు త్రిపురనేని రామస్వామి స్మారక జీవిత సాఫల్య అవార్డుతో మరెన్నో అవార్డులు వరించాయి. 1999లో ముంబాయిలో జరిగిన అంతర్జాతీయ మానవవాద నైతిక సంఘ అంతర్జాతీయ సదస్సులో ‘బుద్ధుడు- హ్యూమనిస్ట్ దృక్పథం’ అంశం మీద ఉపన్యాసం చేసి అంతర్జాతీయ వేదికలపై ఎందరినో ఆలోచింపజేశారు. నిజానికి వెంకటాద్రి గారి గొప్పతనం ఏమిటంటే వారు నిరంతరం తనకు ఉన్న జ్ఞానస్థాయిని అప్‌డేట్ (Update) చేసుకుంటూ జీవితాంతం హేతువాద, మానవవాద ఉద్యమానికి లైట్ హౌస్‌గా వేలాది మందికి స్ఫూర్తిని కలిగించారు.

ప్రేరణరగిలించారు.ఏదో ఒకస్థాయిలో ఎవరికైనా తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో అసహనం, ఆటంకాలు సహజంగా కలుగుతూ ఉంటాయి. కానీ వెంకటాద్రి ఆలోచనలు నిరంతరం పెరుగుతున్న శాస్త్ర, సాంకేతిక, తాత్వికవిషయాలపైన ఉండడం వారిని నిత్యవిద్యార్థిని చేసింది. ఒకానొక సందర్భంలో తనకు కేవలం ఎందుకు?, ఏమిటి?, ఎప్పుడు? ఎక్కడ?, ఎలా? అనేవి మాత్రమే తెలుసునని ప్రకటించిన ఆధునిక కాలపు సోక్రటీస్ అనడం ఆయనకు సరిగ్గా సరిపోతుంది. ఆయన కలం తాకని అభ్యుదయ అంశం లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన రాసిన రచనలు దాదాపు 7000 పేజీల ప్రింట్ రూపంలోని సాహిత్యం రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ -ఇంకొల్లు ప్రాంగణంలో ఉంది. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ‘ప్రపంచ భావగమన చరిత్ర’ లో ఆయన మస్తిష్కం వెలువరించిన భావాలు చిరంతరంగా నిలిచే ఉంటాయి.

* కె శ్రీనివాసాచారి, 7780664115

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News