న్యూఢిల్లీ :దేశ సరిహద్దు లోని హిమాచల్ ప్రదేశ్ సెక్టారులో చైనాకు అనుకుని ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైనిక దళాల స్థావరాలను, బలగాల సంసిద్ధతను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మంగళవారం పరిశీలించారు. దేశ రక్షణలో సైనికులు చూపిస్తున్న ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ ఇదే ఉత్సాహంతో దేశ భౌగోళిక సమగ్రతను రక్షించడంలో నిదానంగా పటిష్టంగా ఉండాలని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని ఆయన సైనిక దళాలను ఉత్తేజపరిచారు. తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత్, చైనా మధ్య గత కొన్ని నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన సందోహ్ సెక్టారు ఉద్రిక్త ప్రాంతంలో రోజంతా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కమాండర్లు సైనిక కార్యకలాపాలు, సన్నాహాలపై క్షేత్రస్థాయి పరిస్థితులను రావత్‌కు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే 40 శాతం అధికంగా చైనా సరిహద్దుల్లో భారత్ 2,00,000 మంది సైనికులను మోహరించింది. ఇటీవల భారత్ అదనంగా 59,000 బలగాలను మోహరించినట్టు నివేదికలు చెబుతున్నాయి.