బెంగళూరు: గాఢంగా ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి మనోవేదనతో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం రాయదుర్గంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కోల్‌కతాకు చెందిన సయ్యదుల్ షేక్ (29) అనే వ్యక్తి రాయదుర్గంలోని బంజారా బస్తీలో పెయింటర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అసోంకు చెందిన సుల్తానా బేగం(26) సిద్ధిఖ్‌నగర్‌లోని ఓ హోటల్‌లో పని చేయడంతో పాటు హోటల్ యజమాని ఇంట్లో నివస్తోంది. ఇద్దరు పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. సుల్తానా తనని పెళ్లి చేసుకోవాలని పలుమార్లు అడిగింది కానీ అతడు దాటవేస్తూ వచ్చాడు.
పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో సయ్యదుల్ ఆమె ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడు. గురవారం ఉదయం తన స్నేహితుల ఫోన్ నంబర్ నుంచి సయ్యదుల్‌కు సుల్తానా ఫోన్ చేసింది. తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, తనని పెళ్లి చేసుకోవాలని అతడిని ఆమె కోరింది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఖరాఖండిగా చెప్పడంతో సుల్తానా ఐదు అంతస్థుల భవనం పైనుంచి దూకింది. కారుపై పడడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.