Wednesday, January 22, 2025

ఏపిలో గుట్టుగా రాయలసీమ లిఫ్ట్ పనులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా నంద్యాల జిల్లా పరిధిలో రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణ పనులు చేపట్టిందని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలిపింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమంగా సాగిస్తున్న ఈ నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయించాలని బోర్డును కోరింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు విరుద్దంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఏపి ప్రభుత్వం చేపట్టిన ఈ పనులకు సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని కోరింది. పర్యావరణ , అటవీశాఖల అనుమతులు లేకుండా పనులు చేస్తున్నట్టు తెలిపింది. గతంలో ఇదే విషయాలను తగిన ఆధారాలతో బోర్డు దృష్టికి తీసుకువచ్చినట్టు గుర్తు చేసింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా 2021లో తీవ్రంగా స్పందించినట్టు తెలిపింది. అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టరాదని ఎన్జీటి గతంలోనే ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించిందని తెలిపింది.

అయినప్పటికీ ఇటీవల మళ్లీ ఏపి ప్రభుత్వం ఎత్తిపోతల పనులు ప్రారంభించిందిని తెలిపింది. కృష్ణానది నుంచి పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే పనులు చేస్టున్నట్టు తెలిపింది. ఇందుకోసం శ్రీశైలం కుడి ప్రధాన కాలువ విస్తరణ పనులు చేస్తున్నట్టు తెలిపింది. శ్రీశైలం జలాశయం నుంచి అక్రమంగా నీటిని తరలించుకుపోయేందుకు ఏపి ప్రభుత్వం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టు తెలిపింది. ఎత్తిపోతల పథకానికి కేంద్ర జలసంఘం నుంచి కూడా అనుమతులు లేవని బోర్డు దృష్టికి తీసుకుపోయింది. తక్షణం చర్యలు తీసుకుని రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయించాలని నీటిపారదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు బుధవారం కృష్ణాబోర్డు చైర్మన్‌కు లేఖరాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News