Monday, December 23, 2024

ఆర్థిక ఊరట!

- Advertisement -
- Advertisement -

రూ.4వేల కోట్లకు బాండ్ల వేలానికి అనుమతి

7న ముంబైలో ఆర్‌బిఐ వేలం
ప్రక్రియ తిరిగి చెల్లింపులకు
13 ఏళ్ల కాలపరిమితి మూడు
నెలలుగా తెలంగాణకు
అనుమతులు ఇవ్వకుండా
తాజాగా మనసు మార్చుకున్న
కేంద్ర బ్యాంకు తెలంగాణ
సహా నాలుగు రాష్ట్రాలకు
అప్పులు సేకరించుకునే
వెసులుబాటు

మన తెలంగాణ/హైదరాబాద్ : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ)ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంపై సానుకూలంగా స్పం దించింది. సెక్యూరిటీ బాండ్ల వేలంతో అప్పులు తెచ్చుకోవడానికి గడచిన మూడు నెలలుగా అనుమతులు ఇవ్వకుండా సతాయిస్తూ వచ్చిన ఆర్‌బిఐ మనసు మార్చుకొంది. ఈనెల 7న సెక్యూరిటీ బాండ్ల వేలం వేసుకొని నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించుకునేందుకు తెలంగాణ రాష్ట్రానికి అనుమతులు ఇచ్చింది. ఈ నాలు గు వేల కోట్ల రూపాయలను తిరిగి చెల్లించేందుకు 13 సంవత్సరాల కాలపరిమితిని విధిస్తూ ఆర్‌బిఐ వేలానికి అనుమతులు ఇచ్చింది. ఈ వేలం ఈనెల 7వ తేదీన ముంబైలోని ఆర్‌బిఐ కేంద్ర కార్యాలయంలో జరిపేందుకు నిర్ణయించినట్లుగా తెలంగాణ రాష్ట్రానికి ఒక లేఖ ఈ వేలంలో పాల్గొనే ఆర్థిక సంస్థలు ఈనెల 7వ తేదీన ఉద యం 10 గంటల నుంచి 11.30 గంటల మధ్య లో బిడ్లు దాఖలు చేయవచ్చునని ఆర్‌బిఐ ఆ లేఖ లో తెలిపింది. ఈ వేలం పాటలో తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల కోట్ల రూపాయలకు సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెడుతోంది. వెయ్యి కోట్లకు 13 సంవత్సరాల కాలపరిమితి, మరో వెయ్యి కోట్ల అప్పుకు 14 సంవత్సరాల కాలపరిమితిని విధిస్తూ సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టుకునే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు ఆర్‌బిఐ అనుమతులు ఇచ్చింది.

అదే విధం గా మహారాష్ట్రకు కూడా నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులకు బాండ్లను వేలానికి పెట్టింది. అందులో రెండు వేల కోట్లకు ఎనిమిదేళ్ల కాలపరిమితి, మరో రెండు వేల కోట్లకు పదేళ్ల కాలపరిమితిని విధిస్తూ ఆర్.బి.ఐ. మహారాష్ట్ర ప్రభుత్వానికి సెక్యూరిటీ బాండ్లను వేలం వేయడానికి అనుమతులు మంజూరు చేసింది. తమిళనాడు రాష్ట్రానికి మాత్రం రెండు వేల కోట్ల రూపాయల అప్పుకు 20 ఏళ్ళ కాలపరిమితితో సెక్యూరిటీ బాండ్ల వేలానికి ఆర్.బి.ఐ. అనుమతులు మంజూరు చేసింది. ఇలా ఈ నాలుగు రాష్ట్రాలకూ ఈనెల 7వ తేదీన జరగబోయే వేలంలో మొత్తం 12 వేల కోట్ల రూపాయలను అప్పులుగా సేకరించనున్నాయి.

ఇరకాటంలో పడ్డ ఆర్.బి.ఐ.

దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ అప్పుల రూపంలో నిధులు సేకరించుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా సతాయిస్తూ వచ్చిన వైనాన్ని జాతీయస్థాయిలో తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాలన్నీ ముక్తకంఠంతో ఎండగట్టడంతో ఆర్.బి.ఐ. ఇరకాటంలో పడిపోయిందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయస్థాయిలో పర్యటనలు చేసిమరీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును, ఆర్.బి.ఐ.పై చేస్తున్న వత్తిళ్ళను కూడా ఎండగడుతూ రావడంతో అభాసుపాలైన ఆర్.బి.ఐ. డ్యామేజి రికవరిలో భాగంగానే సెక్యూరిటీ బాండ్ల వేలానికి అనుమతులు మంజూరు చేసి ఉండవచ్చునని ఆర్ధికశాఖ వర్గాలు అంటున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులోగానీ, ఆర్ధిక నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం పనితీరు భేషుగ్గా ఉందని కీర్తించిన ఆర్.బి.ఐ. సెక్యూరిటీ బాండ్ల వేలానికి నిరాకరిస్తూ రావడానికి తెలంగాణ ప్రభుత్వం, తెలుగు మీడియాతోపాటుగా జాతీయస్థాయిలోని మీడియా కూడా ఆర్.బి.ఐ.తీరును ఎండగడుతూ అనేక కథనాలు రాయడం, టెలికాస్ట్ చేయడంతోనే ఆర్.బి.ఐ. ఎట్టకేలకు పట్టు సడలించిందని, అంటున్నారు.

అంతేగాక ముఖ్యమంత్రి కె.సి.ఆర్. బహిరంగ సభలు, సమావేశాల్లోనే కాకుండా అధికారిక సమావేశాల్లో సైతం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ఎండగడుతూ రావడం, అవన్నీ జాతీయస్థాయిలో అతిపెద్ద చర్చకు దారితీయడంతోనే ఆర్.బి.ఐ. తన పంథాను మార్చుకొని ఉండవచ్చునని కొందరు సీనియర్ అధికారులు ఈ పరిణామాలను విశ్లేషిస్తున్నారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయంగానే భావిస్తున్నామని అంటున్నారు. ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టానికి లోబడి మాత్రమే తెలంగాణ రాష్ట్రం అప్పులు చేసిందని, ఇప్పటి వరకూ ఆ అప్పులు కేవలం 16 శాతం వరకే ఉన్నాయని, అదే బి.జే.పి. పాలిత రాష్ట్రాలు, జమ్ము-కాశ్మీర్ వంటి రాష్ట్రాలు గరిష్టంగా 48 శాతం వరకూ అప్పులు చేశాయని, అయినప్పటికీ ఆ రాష్ట్రాలకు ఎలాంటి ఆంక్షలు విధించని కేంద్ర ప్రభుత్వం, ఆర్.బి.ఐ.లు ఒక్క తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కార్పోరేషన్ల పేరుతో తీసుకొచ్చిన అప్పులను కూడా ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని చెప్పడం, అవి కూడా గతించిన 2020వ సంవత్సరం నుంచి అమలుచేసుకుంటూ వచ్చి 2022వ సంవత్సరంలో అప్పులు చేయడానికి వీల్లేదని చెలికపెడుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వైనంలోని రాజకీయపరమైన కక్ష సాధింపు చర్యలన్నీ జాతీయస్థాయిలో బట్టబయలు కావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా తన చర్యలపై పునరాలోచనలో పడినట్లుగా ఉందని అంటున్నారు.

అందుకే ఆర్.బి.ఐ.కూడా బాండ్ల వేలానికి అనుమతులు ఇచ్చినట్లుగా ఉందని అంటున్నారు. అదే విధంగా 2022-23వ ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణలో అమలులో ఉన్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అవసరమైన నిధుల్లో 53,970 కోట్ల రూపాయలను అప్పుల రూపంలో నిధులను సేకరించుకోవాలని లక్షంగా పెట్టుకొన్నామని, ఆ అప్పులకు అనుమతులు ఇస్తే తెలంగాణపై ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు చేయడంలేదని భావించడానికి ఆస్కారముంటుందని, లేకుంటే కేంద్రంలోని బి.జె.పి. పాలకులు తెలంగాణ రాష్ట్రంపై రాజకీయ కక్ష సాధింప్లు కొనసాగిస్తున్నారనే విషయం మరింత తీవ్రంగా ప్రచారంలోకి వెళుతుందని అంటున్నారు. దీనికితోడు తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో ఇవ్వాల్సిన 34,149 కోట్ల 71 లక్షల రూపాయల వరకూ బకాయిలను కూడా విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వం న్యాయంగా వ్యవహరించినట్లవుతుందని అంటున్నారు. అప్పులు తెచ్చుకోవ్వకుండా, గ్రాంట్ల బకాయిలు ఇవ్వకుండా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పనిగట్టుకొని కేంద్రం వేధింపులకు గురిచేస్తున్నదనే అంశాలు తెలంగాణ పల్లెలకు పాకాయని, జాతీయస్థాయిలోనూ ఇదే చర్చ జరుగుతోందని కేంద్ర ఇంటెలిజెన్స్ (ఐ.బి) కూడా నివేదికలు ఇచ్చినట్లుగా తమకు సమాచారం ఉందని, అందుకే కేంద్ర ప్రభుత్వం, ఆర్.బి.ఐ.లు మనసు మార్చుకొని బాండ్ల వేలానికి అనుమతులు మంజూరు చేసినట్లుగా ఉందని ఆ సీనియర్ అధికారులు వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News