Thursday, November 14, 2024

ఆర్‌బిఐ తెచ్చిన డిజిటల్ రూపాయి

- Advertisement -
- Advertisement -

షాపుల్లో ఏది కొన్నా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్‌ల ద్వారా చెల్లింపులు సాధారణమైపోయాయి. చదువు అంతగా వచ్చినా, రాకున్నా మొబైల్ ఫోన్‌లో మాట్లాడినంత తేలిగ్గా ఆన్‌లైన్ పేమెంట్ చేయడం కూడా జనం అలవాటు చేసుకున్నారు. క్యూ ఆర్ కోడ్ అట్ట లేని చిన్న బేరగాడు కూడా కనబడడు. మెట్రో రైలు స్టేషన్లలో మూత్రశాలల వద్ద రూ. 2 ఇవ్వడానికి అక్కడున్న చుక్కల చతురస్రం పనికొస్తోంది. మార్కెట్లలో డొనేషన్లు సేకరించే వాళ్లు కూడా రేకు డబ్బాలపై క్విక్ రెస్పాన్స్ కోడ్ ని అతికేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే జేబులో పర్సు ఖాళీ ఉన్నా, అసలు లేకున్నా నష్టం లేదు. ఇక డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా నెంబర్లకే పరిమితమైపోయాయి. గూగుల్ పే 2010లో ఈ రంగంలోకి దిగి దేశీయ బిల్లు చెల్లింపుల చక్రాన్ని ఇలా తిప్పేసింది. అదే సంవత్సరం మొదలైన పేటి ఎం, 2015లో ప్రవేశించిన ఫోన్ పే ఒకదానికొకటి పోటీ పడుతూ లేస్తూ ఫోన్ పే ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. 2022 – 23 లో ఫోన్ పే ఆదాయం రూ. 2914 కోట్లు. ఒకే సంవత్సరంలోనే దాని లాభం 77% పెరిగింది. మార్కెట్‌లో 47% భాగస్వామ్యం దీనికే చెందుతుంది.

28 కోట్ల మంది వాడుతుండగా ఏడాదికి 10 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిపై వచ్చే కమీషనే దీని ప్రధాన ఆదాయ వనరుగా చెప్పుకోవాలి. ఫోన్ రీ ఛార్జ్ ఒక్కింటికి రూ. 2 కమీషన్ రూపంలో లభిస్తాయి. బీమా ప్రీమియం, గ్యాస్ బుకింగ్, ఫాస్టాగ్ రీఛార్జ్, కరెంటు బిల్లు, బ్రాడ్ బ్యాండ్ రుసుము ఇలా ఎన్నో ఆర్జిత సేవల ద్వారా వీటికి వచ్చే రాబడి కూడా ఎక్కువే.
ఇన్నాళ్లకు ఇలాంటి ఎలక్ట్రానిక్ చెల్లింపుల విధానంపై రిజర్వ్ బ్యాంకు కన్నుపడింది. 2 ఆగస్టు 2021న ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రవేశపెట్టబడిన డిజిటల్ కరెన్సీ 1 నవంబర్ 2022 నుండి మార్కెట్ లావాదేవీలను ఆరంభించింది. నెల తరువాత ప్రయోగాత్మకంగా, దశల వారీగా ఆర్‌బిఐ డిజిటల్ కరెన్సీ వాడకాన్ని విస్తరిస్తోంది. ఎస్‌బిఐతో పాటు మరో నాలుగు ప్రైవేటు బ్యాంకుల ద్వారా మొదటి దశ పైలెట్ ప్రాజెక్టుగా.. ఆ తర్వాత రెండో దశలో మరో నాలుగు బ్యాంకులను చేర్చింది. ఇంకా పైలెట్ స్థాయిలోనే వున్న డిజిటల్ ఇండియన్ కరెన్సీ దేశంలోని 14 బ్యాంకుల్లో చలామణిలో వుంది. వీటిలో 5 ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయి. నేడు కొన్ని నగరాల వినియోగదారుల అవసరాలు తీర్చే దశకు చేరుకుంది.

ప్రస్తుతం ఈ సౌకర్యం గల ప్రధాన నగరాల్లో హైదరాబాద్ కూడా వుంది. మీ బ్యాంకుల యాప్ ద్వారా డిజిటల్ కరెన్సీని వాడుకొమ్మని ఈ మధ్య తెలుగు పత్రికల్లో ఆర్‌బిఐ ప్రకటనలు ఇస్తోంది. ఇప్పటికే వున్న ప్రైవేట్ ఆన్‌లైన్ చెల్లింపుల యాప్‌లకు తోడుగా ప్రభుత్వ నిర్వహణలో నడిచే ధన మార్పిడి ద్వారం తెరుచుకోవడం ఆర్‌బిఐ చరిత్రలో విశేషమే. కాగితపు నోట్లు ముద్రించే ఆ బ్యాంక్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ నోట్ల పంపిణీ చేస్తోంది. మొబైల్ తెరపై ఇవి ఆర్‌బిఐ గవర్నర్ హామీ సంతకంతో కరెన్సీ నోట్ల రూపంలో కనబడతాయి. రూ. 2000, 500, 200, 100, 50, 20, 10, 5, 2 డినామినేషన్లతో పాటు రూపాయి, అర్ధ రూపాయి నాణేలు కూడా వున్నాయి. బ్యాంకుకు వెళ్లి లేదా ఎటిఎం ద్వారా డబ్బులు డ్రా చేసుకున్నట్లు మన ఖాతాలో వున్న సొమ్ములోంచి అవసరమైన నోట్ల బొమ్మలను ముందుగా డిజిటల్ రూపీ వాలెట్ లోకి లోడ్ చేయాలి. మొబైల్ వాలెట్ లోని డిజిటల్ నోట్ల ద్వారానే జమలు, చెల్లింపులు జరుగుతాయి. నోట్లను తిరిగి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసే రిడీమ్ సదుపాయం కూడా ఉంది. నోట్ల బొమ్మల పైన వాలెట్‌లో ఏ నోట్లు ఎన్ని ఉన్నాయో తెలిపే సంఖ్య వుంటుంది. చెల్లింపులు చేస్తే ఆ నంబర్ తగ్గుతుంది. జమ చేస్తే పెరుగుతుంది.

గూగుల్ పే లాంటి ఇతర యాప్‌ల ద్వారా డైరెక్టుగా బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపులు జరిగితే ఆర్‌బిఐ డిజిటల్ రూపీ విధానంలో కేవలం వాలెట్ ద్వారా జరుగుతాయి. బ్యాంకుకు ఈ లావాదేవీలతో ఎలాంటి సంబంధం ఉండదు. బ్యాలెన్స్ పెరిగినా తగ్గినా వాలెట్‌లో మాత్రమే మారుతుంది. మొబైల్ నంబర్‌కు గాని, క్యూ ఆర్ కోడ్ ద్వారా గాని చెల్లింపు చేయాలనుకున్నప్పుడు వాలెట్‌లో జమ అయి ఉన్న నోట్లలోంచి అవసరమున్న డినామినేషన్‌ను ఎంచుకోవాలి. ఇది వాడకందారులకు అదనపు శ్రమగానే భావించాలి. 45 గ్రాముల కొత్తిమీర కట్టకు రూ. 19.65 పై. బిల్లు వచ్చినా నేరుగా పేమెంట్ చేసే అవకాశం ఇతర యాప్‌లు ఇస్తున్నప్పుడు ఇందులో డిజిటల్ రూపీలను ఎంపిక చేసుకొని పేమెంట్ చెయ్యాలి. క్యూ ఆర్ కోడ్‌పై చెల్లింపు చేసినా నోట్ల ఎంపిక తప్పదు. పైన పేర్కొన్నట్లు రూ. 19.65 పై. చెల్లించాలనుకుంటే రూ. 20 ని ఎంపిక చేసుకొని చిల్లర వదులుకోవాలి. ఎవరికైనా మొబైల్ యాప్ ద్వారా రూ. 50 వేలు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ఆ సంఖ్యను పే కాలమ్‌లో మార్చితే సరిపోతుంది. డిజిటల్ రూపీ యాప్ లోనైతే ముందు బ్యాంక్ బ్యాలెన్సు నుండి రూ. 2 వేల డినామినేషన్ బొమ్మను 25 సార్లు స్త్వ్రప్ చేస్తూ వాలెట్‌లో వాటిని పెంచుకోవాలి.

ఆ తర్వాత పే చేసే నంబర్ ఎంచుకొని వాటిని అందులోకి లోడ్ చేయాలి. ఇదంతా అనవసర శ్రమతో కూడుకున్న పని. దేశీయ కరెన్సీ ముద్రణ బాధ్యత మోస్తున్నందువల్ల ఆర్‌బిఐ మనీ ట్రాన్స్‌ఫర్ యాప్‌లో కూడా రూపాయిల బొమ్మలుంచడం వల్ల కస్టమర్లకు అదనంగా ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదు. పైగా సైబర్ మోసాల ద్వారా వాలెట్‌లోని సొమ్ము మాయమైతే బ్యాంకుకు ఎలాంటి ఫిర్యాదు చేసే అవకాశం లేదు. కస్టమర్లు వాలెట్‌లోకి మార్చుకున్న డబ్బు ఆ ఖాతా డిపాజిట్ లోంచి తగ్గిపోవడం వల్ల రానురాను వాడకందార్లు పెరిగిన కొద్దీ బ్యాంక్ డిపాజిట్లు తగ్గిపోయే అవకాశముంది. అదే గూగుల్ పే లాంటిదైతే పేమెంట్ డైరెక్టుగా బ్యాంక్ బ్యాలెన్స్ లోంచి చేయడం వల్ల అప్పటిదాకా సొమ్ము బ్యాంకులోని వుంటుంది. ఖాతాదారుకు దినవారీ వడ్డీ కూడా వస్తుంది. ఇలా ఆర్‌బిఐ సృష్టించిన డిజిటల్ రూపీ వల్ల కొన్ని కొత్త చిక్కులు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఈ పథకం పైలెట్ రూపంలోనే ఉన్నందువల్ల వాడకం సమస్యలకు తీర్చే మార్గాలు రావచ్చు. మిగతా యాప్ ల మాదిరే ఆదాయాన్ని ఆశిస్తే ఇందులో చాలా మార్పుల అవసరం వుంది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాతాదారులనైనా రాబో యే రోజుల్లో తమ వైపు తిప్పుకోవడంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ రూపీ ఎంత విజయం సాధిస్తుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News