ఇప్పటివరకు 1.80 లక్షల కోట్ల రూపాయల విలువైన రూ.2000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. మార్చి 31 వరకు చలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో ఇది 50 శాతం ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.3.62 లక్షల కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయని గవర్నర్ తెలిపారు. రూ.2000 నోట్లలో 85 శాతం వరకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. బ్యాంకుల్లో నోట్ల డిపాజిట్‌లో ఎలాంటి హడావుడి, భయాందోళనలు లేవని ఆయన చెప్పారు. 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి 4 నెలల సమయం ఉందని, నోట్లను డిపాజిట్ చేయడానికి తొందరపడాల్సిన అవసరం లేదని ఆర్‌బిఐ గవర్నర్ అన్నారు. ఆర్‌బిఐ వద్ద తగినంత కరెన్సీ నిల్వ ఉందని, ప్రజలు రూ. 2000 నోట్లను మార్చుకోవాలని ఆయన సూచించారు.
రూ.500 నోట్లు ఉపసంహరించే ఆలోచన లేదు
రూ.1,000 నోటును మళ్లీ ప్రారంభిస్తారా? లేదా రూ.500 నోటును ఉపసంహరించుకుంటారా? అని ప్రశ్నించగా ఆర్‌బిఐ గవర్నర్ సమాధానమిస్తూ, అలాంటి ఆలోచనే లేదని, దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. దీని గురించి ఊహాగానాలు చేయవద్దని ఆయన ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశారు.