న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగం నుంచి ధరల పరిస్థితి క్రమంగా మెరుగవుతుందని భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ ధీమా వ్యక్తం చేశారు. పటిష్టమైన, స్థిరమైన వృద్ధిని సాధించాలనే దృక్పథంతో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు తగిన చర్యలను ఆర్‌బిఐ తీసుకుంటుందని చెప్పారు. కౌటిల్య ఎకనమిక్ కాంక్లేవ్‌లో శనివారం శక్తికాంత దాస్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థలపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కొలిచే సాధనం ద్రవ్యోల్బణమని తెలిపారు. మొత్తం మీద చూసినపుడు, ప్రస్తుతంసరఫరాల వ్యవస్థ అనుకూలంగా కనిపిస్తోందన్నారు. 2022-23 మొదటి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో రికవరీ నిలదొక్కుకున్నట్లు చాలా హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ సూచిస్తున్నాయన్నారు. దీనినిబట్టి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెండో అర్ధ భాగం (జూలై 1 నుంచి ప్రారంభం)లో ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
మేక్రోఎకనమిక్, ఆర్థిక స్థిరత్వం కొనసాగాలంటే ధరలు నిలకడగా ఉండవలసిన అవసరం ఎంతో ఉందన్నారు. మేక్రో ఎకనమిక్స్ దృష్టి ప్రధానంగా ఆర్థిక వ్యవస్థల పనితీరుపై ఉంటుంది. ఆర్థిక ఫలితాల్లో మార్పులు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విదేశీ మారక ద్రవ్యం రేట్లు, చెల్లింపుల బ్యాలెన్స్‌లపై దృష్టి సారిస్తుంది. పటిష్టమైన ద్రవ్య, ఆర్థిక విధానాల ద్వారా మాత్రమే పేదరికం తగ్గుదల, సాంఘిక సమానత్వం, సుస్థిర వృద్ధి సాధ్యమవుతాయి.“మన నియంత్రణలో లేని అంశాలు సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేయవచ్చు, అయితే మీడియం టెర్మ్‌లో దాని మార్గాన్ని ద్రవ్య విధానం నిర్ణయిస్తుంది. కాబట్టి ద్రవ్య విధానం తప్పనిసరిగా సకాలంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాలి. పటిష్టమైన, సుస్థిర వృద్ధి పథంలో ఆర్థిక వ్యవస్థను నడిపేందుకు ద్రవ్యోల్బణ ఆకాంక్షలను సాకారం చేయడానికి సకాలంలో చర్యలు చేపట్టవలసి ఉంది’ అని శక్తికాంత దాస్ చెప్పారు. మేక్రోఎకనమిక్ స్థిరత్వాన్ని కాపాడటానికి, ప్రోత్సహించడానికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని, ఆర్‌బిఐ విధానాలను సమన్వయపరచుకోవడాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ప్రపంచీకరణ వల్ల కలిగే ప్రయోజనాలతోపాటు కొన్ని నష్టాలు, సవాళ్ళు కూడా ఎదురవుతున్నాయని చెప్పారు.
RBI Governor address in Kautilya Economic Conclave