యథాతథంతో గృహ, వాహన వినియోగదారులకు ఊరట
బ్యాంకుల నుంచి రూపే ప్రిపెయిడ్ ఫారెక్స్ కార్డులు జారీ
ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి
ముంబై : ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) మరోసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. కీలక వడ్డీ రేటు 6.5 శాతంగానే ఉండనుంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశం అనంతరం రిజర్వ్ బ్యాంక్ గురువారం ఈ మేరకు ప్రకటన చేసింది. రెపో రేటు పెంపు నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగం ఊపిరి పీల్చుకుంది. గురువారం ద్వైమాసిక ద్రవ్యవిధాన సమావేశం వివరాలను ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. కీలక రెపో రేటులో మార్పు చేయవద్దని ద్రవ్యవిధాన కమిటీ(ఎంపిసి) సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. మొత్తానికి వడ్డీ రేట్లను పెంచకుండా ఉండడంతో ఇది గృహ, వాహన రుణాలు తీసుకున్న వారికి ఊరటనిచ్చింది. 202324 ఆర్థిక సంవత్సరానికి భారత్ జిడిపి 6.5 శాతాన్ని కొనసాగిస్తున్నట్టు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. దేశీయ డిమాండ్ పరిస్థితులు ఇప్పటికీ వృద్ధికి మద్దతుగా ఉన్నాయని, గ్రామీణ డిమాండ్ పునరుద్ధరణ దశలో ఉందని గవర్నర్ అన్నారు.
రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట
రెపో రేటులో నిరంతర పెరుగుదల కారణంగా తక్కువ ఆదాయ వర్గాలకు ఇల్లు కొనడం కష్టంగా మారింది. 2022 మే నుండి ఇప్పటి వరకు సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును మొత్తం 6 సార్లు పెంచింది. దీంతో రెపో రేటు 4 శాతం నుండి 6.50 శాతానికి పెరిగింది. గత ఏడాది కాలంలో బ్యాంకులు తమ ఎంసిఎల్‌ఆర్ రేట్లను చాలాసార్లు పెంచాయి. దీంతో ప్రజలపై ఇఎంఐ భారం పెరిగింది. కానీ 2023 ఏప్రిల్ నుండి ద్రవ్యోల్బణంపై నియంత్రణ తర్వాత ఆర్‌బిఐ రెపో రేటులో ఎటువంటి మార్పు చేయకపోవడంతో వడ్డీ రేటు 6.50 శాతం వద్ద స్థిరంగా ఉంది. రెపో రేటును పెంచకపోవడంతో కస్టమర్లలో పెరుగుతున్న ఇఎంఐ ఆందోళన తొలగిపోవడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో విక్రయాలు ఊపందుకోనున్నాయి.
అనధికారిక ట్రేడింగ్ యాప్‌లతో జాగ్రత్త
యాప్ స్టోర్‌లో లభించే ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల అప్రమత్తగా ఉండాలంటూ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరికలు జారీ చేశారు. ఫారెక్స్ ట్రేడింగ్‌కు సంబంధించిన 56 నిషేధిత యాప్‌ల జాబితాను ఆర్‌బిఐ వెల్లడించింది. వాటిలో క్యూఎఫ్‌ఎక్స్ మార్కెట్స్, 2విన్‌ట్రేడ్, గురు ట్రేడ్7 లిమిటెడ్, బ్రిక్ ట్రేడ్, రూబిక్ ట్రేడ్, డ్రీమ్ ట్రేడ్, మినీ ట్రేడ్, ట్రస్ట్ ట్రేడ్ వంటివి ఉన్నాయి.
ఇరూపీ వోచర్ల జారీకి అనుమతి
ఇరూపీ పరిధిని ఇప్పుడు పొడిగిస్తున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఇప్పుడు నాన్-బ్యాంకింగ్ కంపెనీలు కూడా ఇరూపీ జారీ చేయడానికి అనుమతించినట్టు తెలిపారు. ఇరూపీ వోచర్‌ల జారీ, రిడీమ్ ప్రక్రియను సులభతరం చేయాలని గవర్నర్ సూచించారు. ఇప్పటి వరకు బ్యాంకుల తరపున మాత్రమే ఇ-ఫారమ్ వోచర్లను జారీ చేసే సౌకర్యం ఉంది. ఇది డిజిటల్ వ్యాప్తిని మరింతగా పెంచుతుందని దాస్ అన్నారు. డిజిటల్ వోచర్ ఇరూపీ 2021 ఆగస్టులో ప్రారంభించారు.