న్యూస్ డెస్క్: ఇటీవల ఉపసంహరించిన రూ. 2000 కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి ప్రజలు బ్యాంకుల వద్దకు పరుగులెత్తాల్సిన అవసరం లేదని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం సూచించారు. ఆశించిన ప్రయోజనాలు నెరవేరిన కారణంగానే రూ. 2,000 నోట్ల చెలామణిని ఉపసంహరించినట్లు ఆయన వివరించారు. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ఆ నోట్ల సంఖ్యను భర్తీ చేసేందుకే రూ. 2,000 కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇతర కరెన్సీ నోట్లన్నీ సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.
రూ. 2,000 కరెన్సీ నోట్లు కూడా రూ.6.73 లక్షల కోట్ల నుంచి రూ. 3.62 లక్షల కోట్లకు తగ్గిపోయాయని, వాటి ముద్రణ కూడా ఆగిపోయిందని ఆయన తెలిపారు. రూ. 2,000 నోట్ల జీవితకాలం పూర్తయిపోయిందని ఆయన చెప్పారు.
రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తున్న కరెన్సీ నిర్వహణ కార్యకలాపాలలో భాగమే రూ. 2,000 నోట్ల ఉపసంహరణని దాస్ చెప్పారు. చాలాకాలంగా క్లీన్ నోట్ పాలసీని రిజర్వ్ బ్యాంక్ పాటిస్తోందని ఆయన వివరించారు. కొన్ని సిరీస్ నోట్లను ఉపసంహరించి కొత్త నోట్లను విడుదల చేయడం ఎప్పటికప్పుడు జరిగే ప్రక్రియగా ఆయన వివరించారు. రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించినప్టపికీ వాటి చట్టబద్ధ చెల్లుబాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు.