న్యూఢిల్లీ: రూ. 6,000 కోట్ల విలువచేసే నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్(ఎన్‌ఎఆర్‌సిఎల్)కు భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బిఐ) మంగళవారం లైసెన్స్‌ను ఇచ్చింది. ఈ చర్యతో ‘బ్యాడ్ బ్యాంక్’ కార్యకలాపాలు మొదలు కానున్నవి. ఎన్‌ఎఆర్‌సిఎల్ ముంబయిలో జులై నెలలో రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కింద రిజిష్టర్ అయింది.
ఎన్‌ఎఆర్‌సిఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎస్‌బిఐకి చెందిన నిరర్ధక ఆస్తుల నిపుణుడు పిఎం నాయర్ నియమితులయ్యారు. బోర్డులో ఉన్న ఇతర డైరెక్టర్లు ఐబిఎ సిఇఒ సునీల్ మెహతా, ఎస్‌బిఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌ఎస్ నాయర్, కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ అజిత్ కృష్ణన్ నాయర్.
ఎన్‌ఎఆర్‌సిఎల్‌కు లైసెన్స్ మంజూరు కావడంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబిఎ) సిఇఒ సునీల్ మెహతా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్‌చేశారు.
బ్యాంకుల నిరర్ధక ఆస్తుల సమస్యను పరిష్కరించడానికి అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అనే రెండింటిని ఏర్పాటు చేయనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదివరకే తెలిపారు. గత నెల ఎన్‌ఎఆర్‌సిఎల్‌కు కేంద్ర క్యాబినెట్ రూ. 30600 కోట్ల సెక్యూరిటీ రిసీట్స్ గ్యారంటీని ఇచ్చింది. బ్యాంకుల బ్యాడ్ లోన్స్‌లో 15 శాతాన్ని ఎన్‌ఎఆర్‌సిఎల్ ఇస్తుంది. కాగా మిగతా 85 శాతంకు ప్రభుత్వ గ్యారంటీ సెక్యూరిటీ రిసీట్లు ఉంటాయి.