Thursday, November 14, 2024

ద్రవ్యోల్బణం ముప్పు

- Advertisement -
- Advertisement -

ద్రవ్యోల్బణం ముప్పు.. అంచనా 5.7 శాతానికి పెంపు

 రెపో రేటు యథాతథం, 9.5 శాతంగా జిడిపి వృద్ధి అంచనా
 ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి

ముంబై: భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్‌బిఐ) వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. 4 శాతంతో యథాతథంగా రెపో రేటును కొనసాగించింది. రేటును యథాతథంగా కొనసాగించడం వరుసగా ఇది ఏడోసారి. ద్రవ్యోల్బణం పెరుగనుందనే అంచనాల నేపథ్యంలో దేశీయ ఆర్థిక పునరుద్ధరణ కోసం రెపో రేటు విషయంలో తటస్థ వైఖరిని సెంట్రల్ బ్యాంక్ అవలంభిస్తోంది. ఇక రివర్స్ రెపో రేటు కూడా 3.35 శాతంతో పాత రేటును కొనసాగించింది. జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటును 9.5 శాతంగా అంచనా వేసింది.
ఆరు సభ్యుల ఎంపిసి (ద్రవ్య విధాన కమిటీ) రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించాయి. ఎంపిసి సమావేశం అనంతరం ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. దేశీయ ఆర్థిక పునరుద్ధరణ, నిలకడ వృద్ధి కోసం సర్ధుబాట ధోరణిని అవలంభించాలని మెజారిటీ సభ్యులు నిర్ణయించారని అన్నారు. ఆర్‌బిఐ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడం వరుసగా ఇది ఏడోసారి. 2020 మే 22న పాలసీ రేట్లను ఆర్‌బిఐ మార్పు చేసింది. ఈ సమయంలో కరోనా మహమ్మారి కారణంగా వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించింది. దీంతో ఇప్పుడు ఈ రేట్లు చారిత్రక కనిష్ట స్థాయిలో ఉన్నాయి. 2020 సంవత్సరానికి ముందు 2019లో రిజర్వు బ్యాంక్ 250 బేసిస్ పాయింట్లు రెపో రేటును తగ్గించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (202122) జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి అంచనాను 9.5 శాతంగా నిర్ణయించింది. అయితే రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను సవరించింది. ద్రవ్యోల్బణం అంచనాను గతంలో 5.1 శాతం నుంచి 5.7 శాతానికి సవరించింది. ధరల ఒత్తిడి కారణంగా అంచనా ద్రవ్యల్బణం లక్షం పరిధికి సమీపంలో ఉంది.
రెట్రో టాక్స్ రద్దుపై గవర్నర్ హర్షం
వివాదాస్పద రెట్రోస్పెక్టివ్ టాక్స్ (పునరావృత పన్ను)ను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్వాగతించారు. విదేశీ సంస్థలతో పన్ను వివాదాలకు కారణమైన ఈ రెట్రో టాక్స్‌ను రద్దు చేసేందుకు పన్ను చట్టం సవరణ బిల్లు2021ను గురువారం లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వివాదాస్పద 2012 చట్టాన్ని రద్దు చేయడానికి ఒక బిల్లును కేబినెట్ ఆమోదించింది. 2012 రెట్రో టాక్స్ కారణంగా కెయిర్న్, వొడాఫోన్ వంటి సంస్థలు దావా వేశాయి. ఈ సవరణ బిల్లు ఆమోదంతో ఐటి శాఖకు సంబంధించిన 17 పన్ను వివాదాలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన తరువాత భారత ప్రభుత్వం మొత్తం ఆర్థిక బాధ్యత రూ.8 వేల కోట్లు ఉంటుంది.

RBI Guv Shaktikanta Das speech after MPC Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News