Wednesday, January 22, 2025

వడ్డీ రేట్లపై కాలమే నిర్ణయిస్తుంది..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండేందుకు సెంట్రల్ బ్యాంక్ అత్యధిక నిఘా పెట్టిందని ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. వడ్డీ రేట్లు అత్యధికంగా ఉండడంపై కాలమే నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం కట్టడి లక్షంగా 2022 మే నెల నుంచి ఇప్పటి వరకు ఆర్‌బిఐ మొత్తంగా 250 బేసిస్ పాయింట్లు రెపో రేటును పెంచింది. దీంతో జులై నెల నాటికి వడ్డీ రేటు 7.44 శాతానికి పెరిగింది. అయితే ఆర్‌బిఐ ద్రవ్యోల్బణం 4 శాతం లోపు, 2 శాతం పైన ఉండేలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గి, 5 శాతం దిగువకు చేరింది. రిజర్వ్ బ్యాంక్ కూడా ద్రవ్యోల్బణం విషయంలో ఊరట ప్రారంభమైందని అంగీకరించింది. దీని కారణంగా దేశం స్థూల ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మెరుగుపడుతోంది. ఆర్‌బిఐ గవర్నర్ మాట్లాడుతూ, వడ్డీ రేట్లు ఇప్పటికీ అత్యధికంగానే ఉన్నాయి, ఎంతకాలం ఈ విధంగా ఉంటాయో కాలం, పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. మధ్యప్రాచ్యంలో సంక్షోభంపై గవర్నర్ స్పందిస్తూ, పక్షం రోజుల్లో అమెరికా బాండ్ రాబడి పెరిగింది, ఇది ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశముందని అన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు ఇంకా పెరగవచ్చని అన్నారు. భారతదేశం ఆర్థిక మూలాలు పటిష్ఠంగా ఉన్నాయని అన్నారు. అనిశ్చితి పరిస్థితులు వచ్చినప్పడు ఆర్థిక రంగం ఎంత పటిష్టంగా ఉందో తెలుస్తుందని, ఈ విషయంలో భారత్ మెరుగైన స్థానంలో ఉందని ఆయన అన్నారు.

రూ.10 వేల కోట్ల 2,000 నోట్లు రావాలి
రూ.2000 నోట్లు వెనక్కి వస్తున్నాయని, ఇంకా రూ.10 వేల కోట్ల విలువచేసే రూ.2 వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. మిగిలిన ఈ నోట్లు కూడా వెనక్కి వస్తాయని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. ఈ నెల ప్రారంభంలో దాదాపు 87 శాతం రూ.2 వేల నోట్లు బ్యాంకుల్లోకి వెనక్కి వచ్చాయ రిజర్వు బ్యాంక్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News