న్యూఢిల్లీ : ఈసారి కూడా ఇఎంఐలు పెరగవు, ఆర్‌బిఐ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది. వడ్డీ రేట్లు వరుసగా నాలుగోసారి కూడా స్థిరంగా ఉంటాయి. అధిక ద్రవ్యోల్బణం భారత్ వృద్ధి అత్యంత ప్రమాదకరమని ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) హెచ్చరించింది. ఈ ఆర్థిక సంవత్సరం(202324) ద్రవ్యోల్బణం అంచనా 5.4 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఆర్‌బిఐ వరుసగా నాలుగోసారి వడ్డీ రేట్లను 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది. అంటే రుణగ్రస్తుల ఇఎంఐ పెరగదు. రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలోని ఎంపిసి (ద్రవ్యపరపతి విధాన కమిటీ) మూడు రోజుల పాటు సమావేశం నిర్ణయాలను శుక్రవారం వెల్లడించింది. రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని ఆర్‌బిఐ ఎంపిసి సమావేశంలోని ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఓటు వేశారు. ఆర్‌బిఐ చివరిసారిగా రెపో రేటును 2023 ఫిబ్రవరిలో 6.5 శాతానికి పెంచింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు రేటులో ఎలాంటి మార్పు లేదు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ద్రవ్యపరిపతి విధాన సమావేశం జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి సమావేశం ఏప్రిల్‌లో జరిగింది. కాగా గత ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును 6 సార్లు 2.50 శాతం మేరకు పెంచారు. ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య కాకుండా 4 శాతం వద్ద ఉండాలని ఆర్‌బిఐ లక్ష్యంగా పెట్టుకుందని గవర్నర్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అంచనా గత సమావేశంలో 5.1 శాతం నుంచి 5.4 శాతానికి పెంచారు. సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్ తెలిపారు. 202324 వాస్తవ జిడిపి వృద్ధి అంచనా 6.5 శాతంగా ఉంది. అదే సమయంలో 202425 మొదటి త్రైమాసికానికి వాస్తవ జిడిపి అంచనా కూడా 6.6 శాతంగా రిజర్వు బ్యాంక్ పేర్కొంది. భౌగోళిక రాజకీయ సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని ఆర్‌బిఐ గవర్నర్ అన్నారు.
రెపో రేటు రూపంలో ద్రవ్యోల్బణంపై పోరాడేందుకు ఆర్‌బిఐ శక్తివంతమైన సాధనం, ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు రెపో రేటును పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య ప్రవాహాన్ని తగ్గించడానికి ఆర్‌బిఐ ప్రయత్నిస్తుంది. రెపో రేటు ఎక్కువగా ఉంటే ఆర్‌బిఐ నుంచి బ్యాంకులు పొందే రుణం ఖరీదైనది అవుతుంది. దీంతో బ్యాంకులు కూడా తమ ఖాతాదారులకు రుణాలను మరింత ఖరీదైనవిగా చేస్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహాన్ని తగ్గిస్తుంది. డబ్బు ప్రవాహం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది, ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ అధ్వాన్న స్థితిలో ఉన్నప్పుడు, రికవరీ కోసం డబ్బు ప్రవాహాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. దీని కారణంగా ఆర్‌బిఐ నుండి బ్యాంకులకు రుణం చౌకగా మారుతుంది. ఖాతాదారులకు కూడా తక్కువ రేటుకు రుణం లభిస్తుంది.
ముఖ్యాంశాలు
ఆర్‌బిఐ బెంచ్‌మార్క్ రేటు (రెపో) 6.5 శాతం కొనసాగింపు.
రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని ఆర్‌బిఐ ఎంపిసి సమావేశంలోని ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఓటు వేశారు.
వృద్ధి రేటు, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆర్‌బిఐ సర్దుబాటు ధోరణి ఉపసంహరణని అవలంభింనుంది.
202324 ఆర్థిక సంవత్సరానికి జిడిపి వృద్ధి రేటు అంచనా 6.5 శాతం
202324కు ద్రవ్యోల్బణం అంచనా 5.4 శాతం
కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడం, ఎల్‌పిజి రేట్లలో కోత వంటివి ద్రవ్యోల్బణం దిగొచ్చేందుకు దోహదం చేస్తాయి.
స్థూల ఆర్థిక స్థిరత్వానికి, స్థిరమైన వృద్ధికి అధిక ద్రవ్యోల్బణం అత్యంత ప్రమాదకరమని ఆర్‌బిఐ గుర్తించింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశం కొత్త వృద్ధి ఇంజిన్‌గా మారింది.
బాహ్య ఆర్థిక అవసరాలు సౌకర్యవంతంగా ఉన్నాయి.
యుసిబిలకు బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద బంగారం రుణం పరిమితి రూ.4 లక్షలకు అంటే రెట్టింపు చేసింది.
పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ స్కీమ్ గడువు 2025 డిసెంబర్ వరకు అంటే రెండేళ్లు పొడిగింపు.
తదుపరి ద్రవ్యవిధాన పరపతి సమీక్ష(ఎంపిసి) సమావేశం డిసెంబర్ 6 నుంచి 8 మధ్య జరుగనుంది.
ఇంకా రూ.12 వేల కోట్ల రూ.2000 నోట్లు రావాల్సి ఉంది..
న్యూఢిల్లీ : రూ.2000 నోటును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి అక్టోబర్ 7 చివరి రోజు, అంటే నేటితో గడువు ముగియనుంది. శుక్రవారం ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, 96 శాతానికి పైగా రూ.2000 నోట్లు బ్యాంకుకు తిరిగి వచ్చాయని, దీని విలువ రూ.3.43 లక్షల కోట్లు ఉంటుందని అన్నారు. దీనిలో 87 శాతం నోట్లు బ్యాంకులో జమ అయ్యాయి. ప్రస్తుతం రూ.12 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చెలామణిలో ఉన్నాయని, అవి ఇంకా రాలేదన్నారు. అంతకుముందు నోట్ల మార్పిడికి చివరి రోజు సెప్టెంబర్ 30, అయితే చివరి తేదీని అక్టోబర్ 7 వరకు పొడిగించింది.