Monday, December 23, 2024

ఆర్‌బిఐ రుణ వివక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని రాష్ట్రాలపట్ల వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమలం పార్టీ పాలి త రాష్ట్రాల పట్ల ఎనలేని ప్రేమను చూపిస్తున్న కేంద్ర సర్కార్ ఇతర రాష్ట్రాల పట్ల చిన్నచూపు చూస్తోందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నా యి. 2023-24వ ఆర్థ్ధిక సంవత్సరం ఈనెల 31వ తేదీ తో ముగుస్తుండటం, దేశవ్యాప్తం గా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నిధుల కొరత ఉన్న రాష్ట్రాలన్నీ రుణాల కోసం ఆర్‌బిఐని ఆశ్రయించాయి. అందులో 18 రాష్ట్రాలకు సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనేందుకు ఆర్‌బిఐ అనుమతులు మంజూరు చేసింది. ఈనెల 26వ తేదీన ఆర్‌బిఐ నిర్వహించనున్న రాష్ట్రాల సెక్యూరిటీ బాండ్లలో ఏకంగా 18 రాష్ట్రాలు పాల్గొంటున్నాయని, ఈ రాష్ట్రాలన్నింటికీ కలిపి రికార్డుస్థాయిలో 60,032 కోట్ల 49 లక్షల రూపాయల రుణా లు ఇచ్చేందుకు అనుమతు లు మంజూరు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో బాండ్ల వేలం నిర్వహించడం ఇదే మొదటిసారని, ఎన్నడూ 50 వేల కోట్లకు మించలేదని, ఆర్ధిక సంవత్సరం చివరి వారం కావడం, సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో రాష్ట్రాల అభ్యర్థనలను కేవలం ప్రభుత్వపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసమే నిధులను విడుదల చేయాలనే కోణంలోనే కాకుండా ఆర్‌బిఐ పెద్దలు ఈసారి రాజకీయ కోణంలో కూడా ఆలోచన చేసి బిజెపి పాలిత రాష్ట్రాలకు రికార్డుస్థాయిలో నిధులు మంజూరు చేసినట్లుగా ఉందని పలువురు ఆర్థ్ధికశాఖలోని పలువురు సీనియర్ అధికారులు వివరించారు. ఎందుకంటే ఈనెల 21వ తేదీన ఆర్‌బిఐ కేవలం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల కోసమే ప్రత్యేకంగా సెక్యూరిటీ బాండ్ల వేలం ప్రక్రియను నిర్వహించిందని, ఈ వేలంలో మహారాష్ట్రకు ఏకంగా 12 వేల కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 12 వేల కోట్ల రూపాయలను రుణాల రూపంలో ఇచ్చిందని వివరించారు. అది చాలదన్నట్లుగా ఈనెల 26వ తేదీన నిర్వహించబోయే బాండ్ల వేలంలో కూడా మహారాష్ట్రకు మరో 8000 కోట్లు, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి 10,500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడానికి ఆర్‌బిఐ అనుమతులు ఇచ్చిందని, ఇలా కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే మహారాష్ట్రకు ఏకంగా 20 వేల కోట్లు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రికార్డుస్థాయిలో 22,500 కోట్ల రూపాయల నిధులను ఇవ్వడంలో తప్పకుండా రాజకీయకోణమే ఉందని, ఇలా ఆర్‌బిఐ కూడా కేంద్రంలోని అధికారపార్టీ పెద్దల మెప్పుకోసమే పనిచేస్తున్నట్లుగా స్పష్టమవుతోందని ఆ అధికారులు వ్యాఖ్యానించారు.

ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్న చివరి పది రోజుల వ్యవధిలోనే ఇంతపెద్ద మొత్తంలో నిధులను విడుదల చేయడమంటే రికార్డేనని, ఆర్‌బిఐ సరికొత్త రికార్డును సృష్టించిందని ఆ అధికారులు వ్యాఖ్యానించారు. సాధారణంగా వారానికొకసారి నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఎంత పెద్ద రాష్ట్రానికైనా గరష్టంగా నాలుగు వేల కోట్ల రూపాయల నుంచి ఆరు వేల కోట్ల రూపాయల వరకే బాండ్ల వేలానికి అనుమతులు ఇచ్చే ఆర్‌బిఐ ఈ రెండు రాష్ట్రాలకు ఏకంగా 20 వేల కోట్లు, 22,500 కోట్ల రూపాయలను ఇవ్వడమంటే ఆశర్యంగా ఉందని, ఈ అంశమే ఇప్పుడు దేశంలో హాట్‌టాపిక్‌గా మారిందని ఆ అధికారులు వివరించారు. ఆర్‌బిఐ కూడా రాజకీయాలు చేస్తోందనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం అక్కర్లేదని చివరకు అధికారవర్గాలు సైతం తప్పుబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కొత్తగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చివరి మూడు నెలల కోసం (జనవరి, ఫిబ్రవరి, మార్చి) కేవలం 15 వేల కోట్ల రూపాయలను బాండ్ల వేలంలో మంజూరు చేయాలని ఆర్‌బిఐకి ఇండెంట్ పెట్టుకుంటే కేవలం 9వేల కోట్లకు మాత్రమే ఆర్‌బిఐ పెద్దలు అనుమతులు ఇచ్చారని, ఆ తర్వాత ఈనెల మొదటి వారం నుంచి ఇప్పటి వరకూ అనేక విధాలుగా ప్రాధేయపడితే మరో రెండు వేల కోట్లకు అనుమతులు ఇచ్చిన ఆర్‌బిఐ అధికారులు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పట్ల ఎంత ఉదారంగా వ్యవహరించిందో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి అత్యధికంగా ఎంపి సీట్లు గెలుచుకోవాలంటే ప్రభుత్వ నిధులతోనే కమలం పార్టీకి ప్రయోజనం కలిగేలా నిధులను వాడుకునేందుకు వీలుకల్పిస్తూ ఆర్‌బిఐ నుంచి ఈ రెండు రాష్ట్రాలకు రికార్డుస్థాయిలో 42,500 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని వివరించారు. అదే దక్షిణాదిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల ఆర్ధిక అవసరాలను తీర్చేందుకు ఆర్‌బిఐ మునుపెన్నడూ ప్రత్యేకంగా సెక్యూరిటీ బాండ్ల వేలాన్ని నిర్వహించలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈనెల 26న నిర్వహించబోయే బాండ్ల వేలంలో తెలంగాణకు కేవలం 1,718 కోట్లకు మాత్రమే ఆర్‌బిఐ అనుమతులు ఇచ్చిందని, అదే విధంగా తమిళనాడు రాష్ట్రానికి 6 వేల కోట్లు, పుదుచ్చేరికి కేవలం వంద కోట్లు, కర్ణాటక రాష్ట్రానికి 3 వేల కోట్లు, కేరళ రాష్ట్రానికి 4,866 కోట్ల రుణాలను పొందేందుకు ఆర్‌బిఐ అనుమతులు మంజూరు చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు 4 వేల కోట్లు, మధ్యప్రదేశ్‌కు 5 వేల కోట్లు, మహారాష్ట్రకు 8 వేల కోట్లు, రాజస్థాన్‌కు 4,996 కోట్లు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానకి 10,500 కోట్లు, ఉత్తరాఖండ్‌కు వెయ్యి కోట్లు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 5 వేల కోట్ల రూపాయలకు రుణాలను సేకరించుకునేందుకు వీలుగా బాండ్ల వేలానికి ఆర్‌బిఐ అనుతమలు మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News