Friday, November 22, 2024

మీకు నచ్చిన క్రెడిట్ కార్డు.. ఆర్‌బిఐ కొత్త మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -

నెట్‌వర్క్‌ను ఎంపిక చేసుకోవచ్చు
కార్డు జారీ చేసే సంస్థలకు ఆర్‌బిఐ కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ : క్రెడిట్ కార్డు నెట్‌వర్క్‌లను ఎంపిక చేసుకునే విధానంలో ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకునే వినియోగదారులకు నచ్చిన కార్డ్ నెట్‌వర్క్‌ని ఎంచుకునే సౌలభ్యం లభిస్తుంది. క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌లు, కార్డ్ జారీ చేసే బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలకు ఆర్‌బిఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం, ఇప్పుడు కార్డ్ జారీ చేసేవారు క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ కార్డ్ నెట్‌వర్క్‌లను ఎంచుకోవడానికి వినియోగదారులకు ఎంపికను ఇవ్వాలి.

ఖాతాదారుడికి ఏ నెట్‌వర్క్ క్రెడిట్ కార్డ్ కావాలో బ్యాంకులు అడగాల్సి ఉంటుంది. పాత క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కార్డును పునరుద్ధరించేటప్పుడు కార్డ్ నెట్‌వర్క్‌ను మార్చుకునే అవకాశాన్ని పొందుతారు. ప్రతి క్రెడిట్ కార్డ్‌కు చెల్లుబాటు ఉంటుందని, అది ఒకటి, రెండు, మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండవచ్చు. కార్డ్ గడువు ముగిసిన తర్వాత నెట్‌వర్క్‌ని మార్చుకోవచ్చు. కొత్త మార్గదర్శకాల ప్రకారం, 10 లక్షలు లేదా అంతకంటే తక్కువ కార్డులు జారీ చేసిన సంస్థలకు ఈ నిబంధనలు వర్తించవు. నోటిఫికేషన్ తేదీ నుండి 6 నెలల వరకు ఈ నియమాలు అమలులో ఉంటాయి.

క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్ అంటే?
ప్రస్తుతం భారతదేశంలో 5 కార్డ్ నెట్‌వర్క్ కంపెనీలు ఉన్నాయి.- వీసా, మాస్టర్ కార్డ్, రూపే, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ వంటి ఐదు నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కంపెనీలు వివిధ ఆర్థిక సంస్థలతో ఒప్పందాలను కలిగి ఉన్నాయి. దీని కారణంగా కస్టమర్ తనకు నచ్చిన కార్డ్ నెట్‌వర్క్‌ను ఎంచుకునే అవకాశం లభించదు.

వినియోగదారులు ఎలా ప్రయోజనమేంటి?
కొన్ని కార్డ్ నెట్‌వర్క్‌లు క్రెడిట్ కార్డ్‌లపై ఇతరుల కంటే ఎక్కువ వార్షిక చార్జీలను వసూలు చేస్తాయి. అందువల్ల ఒక బ్యాంకు మీకు ఒకటి కంటే ఎక్కువ కార్డ్ నెట్‌వర్క్‌ల ఎంపికను ఇవ్వకపోతే ఎక్కువ ఫీజులు ఉన్న నెట్‌వర్క్‌కు చెల్లించవలసి వస్తుంది. ఒకటి కంటే ఎక్కువ కార్డ్ నెట్‌వర్క్‌ల ఎంపికలు ఉంటే మీ అవసరం, దాని ఫీజులు, నెట్‌వర్క్ సౌకర్యాల ఆధారంగా సరైన ఎంపికను చేసుకోగలుగుతారు. ప్రపంచంలో అతిపెద్ద కార్డ్ కంపెనీ వీసా, ఇది 200 కి పైగా దేశాలు, భూభాగాల్లో ఉంది. దీని మార్కెట్ క్యాప్ రూ.489.50 బిలియన్లు అంటే దాదాపు రూ.40 లక్షల కోట్లు ఉంటుంది. వీసా తర్వాత ప్రపంచంలో రెండోది మాస్టర్ కార్డ్, ఇది 150 దేశాలలో ఉంది.

‘రూపే’ స్వదేశీ కార్డ్ నెట్‌వర్క్
రూపే భారతదేశంలో మొట్టమొదటి దేశీయ డెబిట్, క్రెడిట్ కార్డ్ చెల్లింపు నెట్‌వర్క్, ఈ పేరు రూపాయి, చెల్లింపు అనే రెండు పదాలతో రూపొందించబడింది. విదేశీ కార్డ్ నెట్‌వర్క్‌ల గుత్తాధిపత్యాన్ని అంతం చేయడానికి దీనిని 2012 మార్చిలో ప్రారంభించారు. బ్యాంక్ బజార్ నివేదిక ప్రకారం, 2023 ఏప్రిల్ నాటికి భారతదేశంలో 8.6 కోట్ల క్రెడిట్ కార్డులు చెలామణిలో ఉన్నాయి. ఈ సంఖ్య 2022 ఏప్రిల్‌లో 7.5 కోట్ల నుండి 15 శాతం పెరిగింది. 2024 ప్రారంభం నాటికి క్రెడిట్ కార్డుల సంఖ్య 10 కోట్లు దాటుతుందని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News