ఉల్లంఘనలు గుర్తించలేదు
పేటీఎంపై ఇడి విచారణపై అధికాగ వర్గాల వెల్లడి
న్యూఢిల్లీ : పేటీఎంకి మరో ఊరట లభించింది. పేటీఎం పేమెంట్ బ్యాంకు విదేశీ మారక(ఫెమా) ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇంకా ఎలాంటి ఆధారాలు కనుగొనలేదని అధికార వర్గాలు తెలిపాయిరు. ఇడి వారం రోజుల క్రితమే విచారణ ప్రారంభించింది. కెవైసి (నో యువర్ కస్టమర్) నిబంధల అమలులో లోపాలపై ఇడి విచారణ జరుపగా, విదేశీ మారక నిర్వహణ చట్టం ఉల్లంఘనలను కనుగొనలేదు. ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించలేదు. ఆర్‌బిఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ డిపాజిట్లను తీసుకోకుండా నిషేధించింది. దీనికి గడువు తేదీని ఫిబ్రవరి 29 నుండి మార్చి 15 వరకు పొడిగించారు.
మనీలాండరింగ్‌పై విచారణ జరగడం లేదు
పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఆర్థిక లావాదేవీలపై ఇడి దర్యాప్తు చేసింది. ఈ విషయంలో సమాధానం చెప్పేందుకు పేటీఎం అధికారులను కూడా ఇడి పిలిచింది. దీంతో పాటు వారి నుంచి పత్రాలు కూడా స్వీకరించింది. కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. బ్యాంక్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) దర్యాప్తు జరగడం లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
పేటీఎం షేర్లు 5 శాతం జంప్
జనవరి 31న ఆర్‌బిఐ చర్య తర్వాత పేటీఎం షేర్లు దాదాపు 50 శాతం పడిపోయాయి. పేటీఎం మార్కెట్ క్యాప్ కూడా తీవ్రంగా ప్రభావితమైంది. కానీ గత రెండు సెషన్ల నుండి పేటీఎం షేర్లు దాని ఎగువ సర్క్యూట్‌ను తాకుతున్నాయి. ఎక్స్ఛేంజ్‌లో షేరు విలువ ఎగువ సర్క్యూట్ 5 శాతాన్ని తాకింది. స్టాక్ విలువ 17.05 పెరిగి రూ.358కి చేరింది.