Monday, December 23, 2024

ఆర్ధిక విధానాలకు ఆర్‌బిఐ కితాబు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మద్దతు తెలిపినట్లు తెలిసింది. రుణాల నిర్వహణ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు బాగుందని, తెచ్చిన రుణాలను అభివృద్ధి పథకాలకే ఖర్చు చేస్తుండటం మూలంగా రాష్ట్రంలో ఎకనమిక్ యాక్టివిటీ (ఆర్ధిక కార్యకలాపాలు) పెరిగిందని, తద్వారా తిరిగి ప్రభుత్వ ఖజానాకే ఆదాయం వస్తోందని, చాలా రాష్ట్రాలు ఈ పనిచేయడం లేదని రూడా ఆర్‌బిఐ ఉన్నతాధికారులు కొనియాడారని రాష్ట్ర ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. అంతేగాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ వడ్డీరేట్లకే రుణాలను సేకరించుకొందని, దీనికితోడు ప్రభుత్వం తెచ్చిన రుణాలన్నీ 2036వ సంవత్సరం నాటికి మెచ్యూర్ అవుతాయని, అప్పటి వరకూ తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక ప్రగతికి ఎలాంటి ఢోకాలేదని సాక్షాత్తూ ఆర్‌బిఐ ఉన్నతాధికారులే వ్యాఖ్యానించారని, ఈ పరిస్థితి తమకు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉందని ఆ అధికారులు వివరించారు.

రుణాల సేకరణ సమయంలో తెలంగాణ రాష్ట్రానికి గరిష్టంగా 40 ఏళ్ళ కాలపరిమితికి కూడా రుణాలిచ్చేందుకు ఆర్ధిక సంస్థలు ముందుకు వస్తున్న అంశాలపై ఆర్‌బిఐ సంతృప్తిని వ్యక్తంచేసిందని వివరించారు. రుణాలన్నింటినీ క్యాపిటల్ అస్సెట్స్ (ఆస్తులుగా)గా ఆర్‌బిఐ పరిగణించడంతోనే తెలంగాణ ప్రభుత్వ ఆర్ధిక విధానాల పట్ల ఆర్‌బిఐ అధికారులు సానుకూలంగా ఉందో ఇట్టే అర్ధంచేసుకోవచ్చునని ఆ అధికారులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల ఆర్‌బిఐలోని సీనియర్ అధికారులెవ్వరికీ వ్యతిరేకత లేదని, కేవలం రాజకీయపరమైన వత్తిళ్ళ కారణంగానే వనరుల సేకరణకు అడ్డంకులు చెప్పాల్సి వస్తోందని కూడా ఆ అధికారులు బాధపడ్డారని వివరించారు. గ్రౌండ్ రియాలిటీ, ప్రాక్టికాలిటీ (ఆచరణలో)లో తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాల మూలంగా రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఆస్తులు భారీగా పెరిగాయని ఆర్‌బిఐ పెద్దలు కూడా గుర్తించారని వివరించారు.

రుణాలతో సేకరించిన నిధులన్నింటినీ నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు, రోడ్లు, భవనాలు తదితర అభివృద్ధికరమైన మౌలిక సదుపాయాల కల్పనలకే ఖర్చు చేయడంతోనే తెలంగాణ రాష్ట్ర జిఎస్‌డిపి కూడా రెట్టింపు అయ్యిందని కూడా ఆర్‌బిఐ గుర్తించిందని ఆ అధికారులు వివరించారు. కానీ దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు లోపభూయిష్టమైన ఆర్ధిక నిర్వహణలను అనుసరిస్తుండటం మూలంగా, పక్కా ప్రణాళికలు లేకపోవడం మూలంగా ప్రభుత్వ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలకు కూడా అప్పులు చేసిన నిధులను ఖర్చు చేస్తున్నారని, అందుకే ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి జరగడంలేదని కూడా ఆర్‌బిఐ గుర్తించిందని అంటున్నారు. అంతేగాక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీలు కూడా ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులకు లోబడే ఉన్నాయని కూడా ఆర్‌బిఐ గుర్తించిందని ఆ అధికారులు సంతోషం వ్యక్తంచేశారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో “అప్పులు తక్కువ, అభివృద్ధి ఎక్కువ” అనే వ్యాఖ్యానాలు జాతీయస్థాయి ఆర్ధికవేత్తలు అంటున్నారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పులు కేవలం 2,83,452 కోట్లు ఉన్నాయని, జిఎస్‌డిపిలో 23.8 శాతం మాత్రమేనని వివరించారు. కానీ డబుల్ ఇంజన్ రాష్ట్రాలుగా పేరుగాంచిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో అప్పులు ఎక్కువగా చేసిన రాష్ట్రాల్లో అగ్రస్థానం అధిరోహించడానికి రాకెట్ వేగంతో దూసుకుపోతోందని వివరించారు. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి ఏకంగా 7 లక్షల కోట్ల వరకూ (జిఎస్‌డిపిలో 32.1 శాతం) ఉన్నాయని, ఈ అప్పులు కాస్తా 2023-24వ ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి యూపి అప్పులు 7.84 లక్షల కోట్లకు (జిఎస్‌డిపిలో 34.2 శాతం) చేరుతాయని, దేశంలో అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట పరిమితులను యూపీ ప్రభుత్వం ఎప్పుడో దాటిపోయి చట్టాన్ని అతిక్రమించిందని ఆ అధికారులు వివరించారు. అయినప్పటికీ ఇంకా రుణాలు ఎందుకిస్తున్నారంటే అది రాజకీయపరమైన కారణాలతోనే అని ఆర్‌బిఐ అధికారులందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం 7.53 లక్షల కోట్ల అప్పుతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఈ ఏడాది రుణాల సేకరణలో యుపి ప్రభుత్వం పోటీపడి మరీ అప్పులు చేస్తోందని, అందుకే ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి తమిళనాడును వెనక్కునెట్టి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో అగ్రస్థానానికి చేరుకుంటుందని ఆ అధికారులు వివరించారు. ఇక పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 4.83 లక్షల కోట్ల వరకూ ఉన్నాయని, దీనికితోడు 2023-24వ ఆర్ధిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం 53,610 కోట్ల రూపాయలను రుణాలుగా సేకరించుకోవాలని లక్షంగా పెట్టుకొందని, దాంతో ఏపీ అప్పులు 5.37 లక్షల కోట్లకు పెరుగుతాయని వివరించారు. అంతేగాక ఈ రాష్ట్రాలే కాకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయిన మరో పది రాష్ట్రాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ఆ రాష్ట్రాల్లో జీతాలు చెల్లించేందుకు కూడా అప్పులుగా తీసుకొన్న నిధులనే దారి మళ్ళిస్తున్నారని ఆర్‌బిఐకి స్పష్టమైన సమాచారం ఉందని వివరించారు.

పంజాబ్, రాజస్థాన్, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాలు తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయాయని, ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను నడిపేందుకు, జీతాభత్యాలు చెల్లించేందుకు కూడా అప్పులుగా తెచ్చిన డబ్బునే దార్మిళ్ళించి ఇస్తున్నారని వివరించారు. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలు ఎంతో భేషుగ్గా ఉన్నాయని, అందుకే ఆర్‌బిఐ ఉన్నతాధికారులు సంపూర్ణంగా తెలంగాణకు మద్దతు పలికారని ఆ అధికారులు వివరించారు. కాకుంటే తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా తీసుకొన్న కొన్ని నిర్ణయాలు కేవలం రాజకీయపరమైన వత్తిళ్ళ కారణంగా జరిగినవేనని, తమకు ఇష్టంలేకపోయినా మనసు చంపుకొని తెలంగాణకు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చిందని ఆర్‌బిఐలోని పలువురు సీనియర్ అధికారులు సైతం మదనపడుతున్నారని వివరించారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికున్న ఆర్ధిక పరిపుష్టిని, రాష్ట్రంలో అమలవుతున్న ఎకనమిక్ యాక్టివిటీలను, పన్నుల ఆదాయం, రాష్ట్ర సొంత ఆదాయాలను పరిగణ దృష్టిలో తీసుకుంటే ఏడాదికి సగటున 63 వేల కోట్ల రూపాయల వరకూ రుణాలు తీసుకునేందుకు తాము సహకరించాల్సి ఉందని, కానీ రాజకీయపరమైన వత్తిళ్ళ కారణంగా తెలంగాణకు మనస్ఫూర్తిగా సహకరించలేకపోతున్నామని కూడా ఆ అధికారులు తమ అశక్తతను తెలియజేశారని గుర్తుచేశారు. సమీప భవిష్యత్తులోనే ఆర్‌బిఐ సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రానికి సహకరించే రోజులు వస్తాయని గంపెడాశతో ఉన్నామని ఆ అధికారులు ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News