Monday, December 23, 2024

మరో పెద్ద నోటు రద్దు

- Advertisement -
- Advertisement -

ఎటువంటి హంగామా, హడావిడి లేకుండా రిజర్వు బ్యాంకు వివాదాస్పదమైన రూ. 2000 నోటును రద్దు చేసింది. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు వీలైనంత నిశ్శబ్దంగా ఈ పని జరిపించివేసింది. 2016 నవంబరులో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు చేసినంత అట్టహాసంలో వెయ్యో వంతు కూడా లేదు. అప్పట్లో ప్రధాని మోడీ స్వయంగా జాతినుద్దేశించి ఆ ప్రకటన చేశారు. దానివల్ల ఎక్కడెక్కడి నల్లధనం కట్టలు పుట్టలోంచి పాముల్లా బయటకు వస్తాయన్నారు. ప్రజలు తమ వద్దనున్న పెద్ద నోట్లను మార్చుకోడానికి నానా అవస్థలు పడ్డారు. క్యూలల్లో వంద మందికి పైగా మరణించారని అధికారిక గణాంకాలు చెప్పాయి. రూ. 2000 నోటు పుట్టుకే వివాదాస్పదమైనది. చిల్లర మార్చుకోడానికి సులభతరం కాదు. చేతికి ఆ నోటు వచ్చినప్పటి నుంచి దానిని అవసరానికి ఉపయోగపడే డబ్బుగా మార్చుకోడం ఎలా అనే చింతలోనే సామాన్యులు గడుపుతారు. చిల్లర దుకాణదారు గాని, మామూలు హోటల్ యజమాని గాని తీసుకోరు. ఇటువంటి నోటును ఎవరు ఎందుకు ప్రతిపాదించారు, ఎందుకు ముద్రించారు అనే ప్రశ్నకు సమాధానం లేదు.

పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రజల అవసరాలను తీర్చడానికి తక్షణ ఉపాయంగా రూ. 2000 నోటు ముద్రణ తోచి ఉండవచ్చు. ఆ తర్వాత రెండు మూడేళ్ళలోనైనా దీనిని రద్దు చేసి ఉండవచ్చు. అలా చేయకుండా దీనిని ఇంతకాలం ఎందుకు ఉండనిచ్చినట్టు? రెండు వేల నోట్లలో భారీగా డబ్బు దాచుకొంటున్నట్టు కేంద్ర ఆర్ధిక వ్యవహారాల మాజీ కార్యదర్శి ఎస్‌సి గార్గ్ గత ఏడాదే హెచ్చరించారు. గుప్తధనం నిల్వ ఉంచుకోడానికి అనువైన కరెన్సీగా ఈ నోటు ఉపయోగపడుతున్నట్టు కేంద్ర ఆర్ధిక శాఖ గత సంవత్సరం విడుదల చేసిన వివరాలు వెల్లడించాయి. మన దేశంలో డబ్బు వినియోగించడం కంటే దాచుకోడానికే ప్రాధాన్యం ఇస్తారు. అందుచేత చిన్న నోట్ల మీద కంటే పెద్దవాటి మీదే వారికి ఎక్కువ మక్కువ. పెద్ద నోట్లలో డబ్బు దాచుకొంటున్నారని భావించినందువల్లనే 2016లో రూ. 500, 1000 నోట్లను రద్దు చేశారు. అయితే అంతకు మించిన కరెన్సీ భోషాణం అనదగిన రూ. 2000 ను తెచ్చారు. రెండు వేల నోటును రద్దు చేసే ఉద్దేశం లేదని గత డిసెంబర్‌లోనే కేంద్రం పార్లమెంటుకు చెప్పింది.

ఇంతలోనే దానిని రద్దు చేయడంలోని ఆంతర్యం ఏమిటి? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోడం వల్ల కలిగిన తెలివితో తీసుకొన్న చర్య అనుకోవాలా? సుప్రీంకోర్టును, కొలీజియం వ్యవస్థను తెగ తిట్టిపోసిన కిరెన్ రిజిజును న్యాయ శాఖ మంత్రిత్వం నుంచి తప్పించడం కూడా అటువంటి చర్యేనా? రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం 2017 మార్చి నెలాఖరుకు 3285 మిలియన్ల రెండు వేల నోట్లు వినియోగంలో ఉన్నాయి. ఏడాది తర్వాత 2018 మార్చి మాసాంతానికి ఇవి స్వల్పంగా పెరిగి 3363 మిలియన్లు అయ్యాయి. అప్పటికి వినియోగంలో గల మొత్తం కరెన్సీ 18037 బిలియన్ల రూపాయల్లో ఈ నోట్లు 37.3 శాతం అంటే ఎంత భారీ స్థాయిలో ఇవి ఉనికిలో ఉన్నాయో అర్ధం అవుతున్నది. కేవలం సంపన్నుల ప్రయోజనం కోసమే ఈ నోట్లను ఇంతకాలం సర్క్యులేషన్‌లో ఉంచారు అని అనిపించిండాన్ని తప్పు పట్టగలమా? పెద్ద నోట్ల రద్దు సమయంలో భారీ ఎత్తున గుప్తధనం వస్తుందని అన్నారు. అదంతా తెల్ల సొమ్ము అయిపోయి ఆర్ధిక వ్యవస్థలో కలిసిపోలేదా? ఇప్పుడు సైతం అటువంటి దొడ్డిదార్లు ఇప్పటికే తెరుచుకొని ఉంటాయనే అభిప్రాయం

కలిగితే ఆక్షేపించగలమా? 2000 రూపాయల నోట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారని, దొంగ సొమ్ము దాచుకోడానికి, ఉగ్రవాదులకు సాయం చేయడానికి వాటిని ఉపయోగిస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఎంపి సుశీల్ కుమార్ మోడీ గత డిసెంబర్‌లోనే రాజ్యసభకు తెలియజేశారు. ఈ నోట్లను రద్దు చేయాలని ఆయన అప్పుడే కోరారు. కాని వాటి రద్దుకు ఇంత కాలం పట్టిందంటే రాజకీయంగా దీనిని తమ విజయంగా చూపించుకోడానికి కర్ణాటక ఫలితాల తర్వాత బిజెపి పెద్దలు రచించిన వ్యూహమేనని అనుకోవలసి వుంది. ఇప్పటికీ ప్రభుత్వోద్యోగులు పెట్రోల్, డీజిల్ వినియోగదార్ల వద్ద నుంచి నేరుగా వసూలు చేస్తున్న పన్ను మీదనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడుతున్నది. కాని నిలువెల్లా నోట్ల కట్టలతో గుప్తధన రాశులను కూడబెట్టుకొన్న కార్పొరేట్ యాజమాన్యాల నుంచి తగినంతగా పన్ను వసూలు చేయడంలో విఫలమవుతున్నది. ఆ కారణంగానే దేశంలో గుప్తధనం ఎవరెస్టంతా పెరిగిపోయి ద్రవ్యోల్బణానికి, అధిక ధరలకు దారి తీస్తున్నది. కోట్లాది మంది

సాధారణ ప్రజానీకం జీవితాలను దుర్భరం చేస్తున్నది. 2000 రూపాయల నోట్లు కలిగిన వారు వాటిని బ్యాంకుల్లో అందజేయడానికి తగిన అవకాశాన్ని ఆర్‌బిఐ కల్పించింది. సర్క్యులేషన్‌లో వున్న నోట్ల మేరకు ఆ డబ్బు ప్రభుత్వానికి తిరిగి వస్తుందో లేదో వేచిచూడాలి. విదేశాల్లో మూలుగుతున్న గుప్తధనాన్ని దేశంలోకి తీసుకు వచ్చి ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తానని చెప్పిన ప్రధాని మోడీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయారు. కనీసం దేశీయ గుప్తధనాన్ని కొంత మేరకైనా వెలికి రప్పించగలిగితే అది గొప్ప చర్యే అవుతుంది. జాతికి ఎంతో ఉపకరిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News