న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం జారీచేసిన ఒక ప్రకటన ప్రకారం అంతర్జాతీయ వాణిజ్యం కోసం రూపాయి సెటిల్మెంట్ వ్యవస్థను ఆవిష్కరించింది. రూపాయిలలో అంతర్జాతీయ వాణిజ్య పరిష్కారాల కోసం ఈ విధానం ప్రకారం, బ్యాంకులు ఉపయోగించడానికి ముందస్తు అనుమతి పొందవలసి ఉంటుందని భారత రిజర్వు బ్యాంకు సోమవారం తన ప్రకటనలో తెలిపింది. ఈ ఉత్తర్వు తక్షణమే అమల్లోకి వస్తుంది. ఇంతేకాక ‘ఎగుమతులకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ వాణిజ్య వృద్ధిని ప్రోత్సహించడానికి’ యంత్రాంగం రూపొందించబడింది.
భారతదేశం నుండి ఎగుమతులకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ వాణిజ్య వృద్ధిని ప్రోత్సహించడానికి, భారత రూపాయిల్లో గ్లోబల్ ట్రేడింగ్ కమ్యూనిటీలో పెరుగుతున్న ఆసక్తికి మద్దతుగా, ఇన్వాయిస్, చెల్లింపు కోసం అదనపు ఏర్పాటును చేయాలని, భారతీయ రూపాయిల్లో ఎగుమతులు/దిగుమతుల విధానం జరిగేలా నిర్ణయించినట్లు ఆ ప్రకటన పేర్కొంది. ఈ కొత్త యంత్రాంగం ప్రకారం, ఎగుమతిదారులు, దిగుమతిదారులు భాగస్వామ్య దేశంలోని కరస్పాండెంట్ బ్యాంక్‌కి లింక్ చేయబడిన ప్రత్యేక వోస్ట్రో(Vostro) ఖాతాను రూపాయిల్లో చెల్లిపులు, స్వీకరణ కోసం ఉపయోగించవచ్చు.