Thursday, December 19, 2024

గత ఖాతాల తాళం ఉద్గమ్

- Advertisement -
- Advertisement -

ఖాతాకు చెందిన ఏదో ఆధారం ఉంటే తప్ప బ్యాంకు వాళ్లు ఖాతాకు సంబంధించిన వివరాలు తెలుపలేరు. పాస్ బుక్ లేదా చెక్ బుక్ చూయించినా నామినేటెడ్ వ్యక్తిగా నిరూపించుకోవాలి. బ్యాలెన్స్ తెలిశాక తక్కువ సొమ్ము కోసం రుజువు పత్రాలతో బ్యాంకుల చుట్టూ తిరిగే ఓపిక లేక వదిలేసుకొనేవారే ఎక్కువ. అందువల్ల ఆర్‌బిఐ నుండి అలాంటి సొమ్మును బ్యాంకులు వెనక్కి రప్పించుకున్న సందర్భాలు చాలా అరుదు. ఏడాదికేడాది పెరుగుతున్న ఈ మొత్తం పై పరిష్కారం కావాలని ప్రభుత్వం బడ్జెట్ సమయంలో ప్రస్తావన తెచ్చింది. 2014 రూ. 4 వేల కోట్లున్న ఈ మొత్తం 2020లో రూ. 24 వేల కోట్లు చేరింది. 2022 23 నాటికి ఇలా ఖాతాదారులు అడగక, ఆర్‌బిఐకి చేరిన సొమ్ము రూ. 48 వేల కోట్లు అని గణాంకాలు చెబుతున్నాయి. సుమారు 30 ఏళ్ల క్రితం మన బ్యాంకింగ్ రంగం కంప్యూటీకరించడంతో నిర్వహణలో సమూల మార్పులు వచ్చాయి. ముందు మాదిరిగా సిబ్బంది శ్రమపడి కదలని ఖాతాలను వేరు చేసే పని లేదు. అంతా కంప్యూటరే చూసుకుంటుంది.

ఏదో అవసరం పడి బ్యాంకుల్లో ఖాతా తెరవడమే కానీ దాంతో పని తీరిందని ఖాతాను రద్దు చేసుకొనే ఆలోచన వచ్చేది కొందరికే. ఆన్‌లైన్ విధానం మొదలవని రోజుల్లో చదువు పూర్తయిన విద్యార్థులు, బదిలీపై ఊరు మారే ఉద్యోగులు ఖాతాను తీసేసి అందులో ఉన్న డబ్బులీయమని బ్యాంకుకు వెళ్లేవారు. ఇప్పుడా అవసరం కూడా లేదు. బ్యాంకులు కంప్యూటరీకరణకు పూర్వం లావాదేవీలన్నీ కాగితాలపై సాగేవి. ఖాతాలన్నీ గట్టి చెక్క బౌండ్ గల లెడ్జర్లలో షీట్లపై రాసి ఉండేవి. ఒక్కో లెడ్జర్‌లో వీలునుబట్టి రెండు, మూడు వందల ఖాతాల వివరాలు ఉంచేవారు. బిజినెస్‌ను బట్టి ఒక్కో బ్రాంచిలో అలాంటి లెడ్జర్లు పది నుండి పదిహేను దాకా ఉండేవి. వాటిలో లావాదేవీలు నడవని ఖాతాలు కూడా కలిసే ఉండడం వల్ల నడిచే ఖాతాలను వెదకడంలో, లెడ్జర్ మోయడంలో సమయం పడుతున్నందువల్ల ఏడాది, రెండేళ్లుగా లావాదేవీలులేని ఖాతా షీట్లను అప్పుడప్పుడు వేరు చేసేవారు. అలా పొదుపు, కరెంట్ ఖాతాలను ఆపరేటివ్, ఇనాపరేటివ్‌గా విడదీసి ఇనాపరేటివ్ ఖాతాలను వేరు లెడ్జర్లలోకి మార్చడం వల్ల సిబ్బందికి సౌలభ్యంగా ఉండేది.

అంతేకాకుండా ఏళ్ల తరబడి ఖాతా నడపకపోవడంతో ఖాతాదారు ఉన్నారో లేరో, దూర ప్రాంతాలకు వెళ్లిపోయారో, ఇకరారు అనుకొని ఉద్యోగులు అవినీతికి పాల్పడే అవకాశాలు ఉండేవి. దాన్ని అరికట్టడానికి ఇనాపరేటివ్ అకౌంట్ల ఓపెనింగ్ ఫారాలను అధికారుల కస్టడీలో ఉంచేవారు. ఓపెనింగ్ ఫారంలో ఖాతాదారు సంతకం ఉంటుంది కాబట్టి దాన్ని ఫోర్జరీ చేయకుండా అలా జాగ్రత్తలు తీసుకొనేవారు. ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేని ఖాతాల నుండి జరిమానాగా ప్రతి ఏడాది జనవరిలో కొంత రుసుముని కోత వేస్తుంటారు. అలా కనీస మొత్తం లేని ఖాతాలు ఈ జరిమానా పడుతూ కొన్నేళ్ళకు సున్నాకు చేరుకుంటాయి. అలా మూతబడే ఇనాపరేటివ్ ఖాతాలు బ్యాంకు భారాన్ని తగ్గించేవి. ఇలా వేరు చేసిన ఖాతాలు పదేళ్లు దాటితే వాటి వివరాలు, వాటిలో ఉన్న సొమ్ము అంతా రిజర్వ్ బ్యాంకుకు పంపాలి. అలా ప్రతి ఏడాది బ్యాంకులు ఈ ఖాతాలను ఆర్‌బిఐకి అప్పగిస్తాయి. వీటిలో చాలా వరకు చిన్న చిన్న మొత్తాలు ఉండటం వల్ల వాటిని క్లెయిమ్ చేసేవాళ్ళు తక్కువ.

ఖాతాకు చెందిన ఏదో ఆధారం ఉంటే తప్ప బ్యాంకు వాళ్లు ఖాతాకు సంబంధించిన వివరాలు తెలుపలేరు. పాస్ బుక్ లేదా చెక్ బుక్ చూయించినా నామినేటెడ్ వ్యక్తిగా నిరూపించుకోవాలి. బ్యాలెన్స్ తెలిశాక తక్కువ సొమ్ము కోసం రుజువు పత్రాలతో బ్యాంకుల చుట్టూ తిరిగే ఓపిక లేక వదిలేసుకొనేవారే ఎక్కువ. అందువల్ల ఆర్‌బిఐ నుండి అలాంటి సొమ్మును బ్యాంకులు వెనక్కి రప్పించుకున్న సందర్భాలు చాలా అరుదు. ఏడాదికేడాది పెరుగుతున్న ఈ మొత్తం పై పరిష్కారం కావాలని ప్రభుత్వం బడ్జెట్ సమయంలో ప్రస్తావన తెచ్చింది. 2014 రూ. 4 వేల కోట్లున్న ఈ మొత్తం 2020లో రూ. 24 వేల కోట్లు చేరింది. 2022 23 నాటికి ఇలా ఖాతాదారులు అడగక, ఆర్‌బిఐకి చేరిన సొమ్ము రూ. 48 వేల కోట్లు అని గణాంకాలు చెబుతున్నాయి.

సుమారు 30 ఏళ్ల క్రితం మన బ్యాంకింగ్ రంగం కంప్యూటీకరించడంతో నిర్వహణలో సమూల మార్పులు వచ్చాయి. ముందు మాదిరిగా సిబ్బంది శ్రమపడి కదలని ఖాతాలను వేరు చేసే పని లేదు. అంతా కంప్యూటరే చూసుకుంటుంది. రెండేళ్లుగా వాడకం లేని ఖాతాలను డార్మెంట్ అకౌంట్‌గా బదిలీ అయి, ఆ తర్వాత పదేళ్లుగా లావాదేవీలు జరగని పొదుపు, కరెంట్, టర్మ్ డిపాజిట్ ఖాతాలను సిస్టం ప్రోగ్రామింగ్ ప్రకారం దశల వారీగా ఆర్‌బిఐకి చేరిపోతాయి. అయితే ఆర్‌బిఐ ఎప్పుడూ వాటిని ఖాతాదారులకు తెలియజేసే వ్యవస్థ స్వయంగా ఏర్పరచకుండా తిరిగి ఖాతా తెరిచిన బ్యాంకుపైనే ఆ బాధ్యత ఉంచేది. ఖాతాకు సంబంధించిన ఎలాంటి ప్రాథమిక ఆధారం లేని వారు ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయేవారు. ఈ చిక్కు ముళ్ళు విప్పేలా ఆర్‌బిఐ ఈ మధ్య ఒక ఆన్‌లైన్ వేదికను అందుబాటులోకి తెచ్చింది.

ఇలాంటి ఖాతాదారుల సౌలభ్యం కోసం ఆన్‌లైన్ ద్వారా అన్ని బ్యాంకుల్లోని అన్ క్లయిమ్డ్ డిపాజిట్ అకౌంట్ల గురించి ఒకే చోట తెలుసుకునేలా ‘ఉద్గమ్’ (అన్ క్లయిమ్డ్ డిపాజిట్స్ గేట్ వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్) అనే పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఏప్రిల్ నుండే ఇలాంటి పోర్టల్ అందుబాటులోకి తేవాలని ఆర్‌బిఐ అనుకున్నా ఓ ప్రయత్నంగా మే 12న ‘వంద రోజులు, వంద చెల్లింపులు’ అనే అన్ క్లెయిమ్ డిపాజిట్ల సెటిల్ మెంట్ కోసం బ్యాంకులకు ఓ పని పెట్టింది. అంటే వంద రోజుల పాటు బ్యాంకులు రోజుకొక ఖాతాదారుని కనిపెట్టి చెల్లింపు చేయాలన్న మాట. ఆ ప్రయోగం తరవాత ఈ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. udgam.rbi. org.in ద్వారా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ అయ్యేందుకు పేరు, మొబైల్ నంబర్ పాస్ వర్డ్ తెలపాలి. ఆ మొబైల్ కు వచ్చిన ఒటిపితో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

ఇక పాస్ వర్డ్ ద్వారా లాగిన్ కావచ్చు. ఆ తర్వాత వివరాలు తెలుసుకొనేందుకు ఖాతాదారు పేరు, బ్యాంకు పేరు వీటితో పాటు ఏదైనా గుర్తింపు కార్డు నంబర్ పూరిస్తే చాలు ఆ పేరిట నిశ్చలంగా ఉన్న ఖాతాలు ఏ బ్యాంకుల్లో ఉన్నది తెలిసిపోయింది. తమవి కానీ, వేరెవరివైనా తెలుసుకొనే సదుపాయం ఇందులో ఉంది. ఖాతాకు సంబంధించిన ఏ రుజువు లేని వారసులు మరణించిన ఖాతాదారుల ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటి వాటి ఆధారంగా బ్యాంకు వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ఖాతా తెరిచేప్పుడు కానీ, ఆ తర్వాత కానీ ఖాతాదారుడి గుర్తింపు కార్డు వివరాలు ఖాతాలో నమోదు చేసి ఉండాలి. కెవైసి నిబంధనల మేరకు దాదాపు అందరు ఫోటో, అడ్రస్ రుజువు కోసం వీటిని ఇచ్చే ఉంటారు. వ్యక్తుల లేదా సంస్థల పేరిట ఉన్న డార్మెంట్ అకౌంట్లను తక్కువ వివరాలతో తేలిగ్గా తెలుసుకొనే ఈ పోర్టల్ వేగంగా, సరియైన సమాచారం ఇవ్వగలిగితే ఖాతాదారులకు ఎంతో మేలు చేసినట్లే.

రెండు నిమిషాల్లో ఫలితం చెప్పే ఈ పోర్టల్ సహాయం తీసుకొంటే కొండలా పెరుగుతున్న భారీ సొమ్ములో ఎవరిది ఎంతుందో తేలిపోతుంది. తమ సొమ్ము బ్యాంకుల్లో ఉందని తెలిసే మార్గం లేక ఆశలు వదిలేసుకొన్న అవసరార్థులకు ఇదెంతో ప్రయోజనకారి. అనుకోకుండా పెద్ద మొత్తాలు కూడా హక్కుదారులకు చెందవచ్చు. పొదుపు, భద్రత పేరిట దాచుకున్న సొమ్మును తిరిగి ఖాతాదారులకు లేదా వారి వారసులకు వడ్డీతో సహా అందేలా ఆర్‌బిఐ దోహద పడడం మంచి పరిణామం. బ్యాంకులో దాచిన సొమ్ము ఏనాటికైనా తిరిగి చేతిలోకి వస్తుందన్న భరోసా ఈ పోర్టల్ కల్పిస్తోంది. ఇది భారత బ్యాంకింగ్ రంగంలో ఓ ముందడుగు అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా ఈ సదుపాయం ఏడు బ్యాంకుల్లో ప్రవేశపెట్టినా అక్టోబర్ పదిహేను నాటికి అన్ని బ్యాంకులకు వర్తిస్తుందని ఆర్‌బిఐ చెబుతోంది. ప్రస్తుతం ఆర్‌బిఐ వద్ద మూలుగుతున్న ప్రజాధనం ఏడాదికేడాది పెరగడం మాని తరగడం మొదలైతే ‘ఉద్గమ్’ లక్ష్యం నెరవేరినట్లే.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News