టైటిలే లక్ష్యంగా ముందుకు
మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఐపిఎల్ సీజన్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) అసాధారణ ఆటతో అదరగొడుతోంది. ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు ఆడిన ఛాలెంజర్స్ ఏకంగా ఏడు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణి స్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటోంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఈసారి బరిలోకి దిగిన బెంగళూరు అసాధారణ ఆటతో అందరిని అశ్చర్యంలో ముంచెత్తుతోంది. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. కోహ్లి అత్యంత నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. కోహ్లి పది మ్యాచుల్లో ఇప్పటికే 443 పరుగులు చేశాడు.
ఇందులో ఆరు అర్ధ సెంచరీలు కూడా ఉండడం విశేషం. సహచర ఓపెనర్ ఫిల్ సాల్ట్‌తో కలిసి దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు మెరుగైన ఆరంభాన్ని అందిస్తున్నాడు. జట్టు విజయాల్లో బెంగళూరు ఓపెనర్లు సాల్ట్, కోహ్లిలు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. దేవ్‌దుత్ పడిక్కల్ కూడా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కీలక ఇన్నింగ్స్‌లతో జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. టాప్3లోని బ్యాటర్లు మెరుగైన ఆటను కనబరుస్తుండడం జట్టుకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఇక కెప్టెన్ రజత్ పటిదార్ కూడా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.
కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. అతనికి సీనియర్లు కోహ్లి, హాజిల్‌వుడ్, కృనాల్ పాండ్య తదితరులు సలహాలు, సూచనాలను అందిస్తున్నారు. వీరందరి అండతో పటిదార్ జట్టును విజయపథంలో నడిపించడంలో సఫలమవుతున్నాడు. యువ ఆటగాళ్లు జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్‌లు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు అండగా నిలుస్తున్నారు. బౌలింగ్‌లో కృనాల్, హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ తదితరులు మెరుగ్గా రాణిస్తున్నారు. ఇలా ప్రతి ఆటగాడు తన వంతు బాధ్యతను సమర్థంగా పోషిస్తుండడంతో బెంగళూరు సీజన్‌లో టాప్‌లోకి దూసుకెళ్లింది.
ట్రోఫీపై కన్ను..
వరుస విజయాలతో దూకుడు మీదున్న బెంగళూ రు ఈసారి టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. గతానికి భిన్నంగా ఈ సీజన్‌లో ఛా లెంజర్స్ అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తోం ది. ఇప్పటికే ఏడు విజయాలు సాధించి దాదాపు ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో కనీసం ఒక్క దాంట్లో గెలిచి నా నాకౌట్‌కు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్ దాదాపు ఖరారు కావడంతో బెంగళూరు ఇక టైటిల్‌పై కన్నేసింది. లీగ్ దశలో మరి న్ని విజయాలు సాధించి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలని తహతహలాడుతోంది. ప్రస్తుతం జట్టు ఆటను గమనిస్తే ఈ సీజన్‌లో బెంగళూరు టైటిల్ సాధించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. చివరి వరకు ఇదే జోరును కొనసాగిస్తే బెంగళూరు ఐపిఎల్ ట్రోఫీ కలను నెరవేర్చుకోవడం ఖాయం. టోర్నీ ఆరంభం నుంచి ఐపిఎల్‌లో కొనసాగుతున్న బెంగళూరు ఒక్కసారి కూడా టైటిల్‌ను సాధించలేదు. ఈసారి మాత్రం ఆ లోటును తీర్చుకోవాలనే లక్షంతో కనిపిస్తోంది.