Thursday, November 14, 2024

తీరు మారని బెంగళూరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఐపిఎల్ సీజన్17లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. రాజస్థాన్, హైదరాబాద్, కోల్‌కతా వంటి ఏమాత్రం అంచనాలు లేని జట్లు అసాధారణ ఆటతో అదరగొడుతుండగా టోర్నీలో ఫేవరెట్‌గా భావించిన బెంగళూరు మాత్రం అత్యంత చెత్త ఆటతో అభిమానులను నిరాశలో ముంచెత్తుతోంది. విరాట్ కోహ్లి, మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్, విల్ జాక్స్, పటిదార్, దినేశ్ కార్తీక్, మహిపాల్, అనూజ్ రావత్, సిరాజ్ వంటి అగ్రశేణి ఆటగాళ్లతో కూడిన బెంగళూరు ఈ సీజన్‌లో పూర్తిగా తేలిపోయిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఛాలెంజర్స్ ఆరింటిలో పరాజయం పాలైంది.

కేవలం ఒకే ఒక విజయాన్ని సాధించింది. ఇక చివరగా ఆడిన ఐదు మ్యాచుల్లోనూ వరుస ఓటములను చవిచూసింది. డుప్లెసిస్ పేలవమైన కెప్టెన్సీ బెంగళూరుకు అతి పెద్ద సమస్యగా మారింది. కిందటి సీజన్‌లో కాస్త మెరుగైన కెప్టెన్సీతో ఆకట్టుకున్న డుప్లెసిస్ ఈసారి మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించడంలో వైఫల్యం చవిచూస్తున్నాడు. అతని వైఫల్యం జట్టును వెంటాడుతోంది. విరాట్ కోహ్లి రాణిస్తున్నా జట్టును మాత్రం గెలిపించలేక పోతున్నాడు. కొన్ని మ్యాచులుగా దినేశ్ కార్తీక్, డుప్లెసిస్‌లు కాస్త బాగానే ఆడుతున్నారు. అయినా కూడా బెంగళూరుకు వరుస ఓటములు తప్పడం లేదు.

తేలిపోతున్న మ్యాక్‌వెల్..
ఐపిఎల్‌లో అత్యంత విధ్వంసకర బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ సీజన్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఒక్క మ్యాచ్‌లోనూ జట్టుకు అండగా నిలువలేక పోయాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. మ్యాక్స్‌వెల్‌పై జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే అతను మాత్రం పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన మ్యాక్స్‌వెల్ వైఫల్యం బెంగళూరుకు అతి పెద్ద సమస్యగా మారింది. అతను పేలవమైన ఫామ్‌తో సతమతమవుతుండడం జట్టుకు ప్రతికూలంగా తయారైంది. దీంతో మ్యాక్స్‌వెల్‌ను హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో దూరంగా ఉంచాల్సి వచ్చింది.

రజత్ పటిదార్, కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నాడు. మహిపాల్, సౌరవ్ చౌహన్ తదితరులు కూడా ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమవుతున్నారు. ఇక బౌలింగ్‌లో అయితే బెంగళూరు ప్రదర్శన మరింత పేలవంగా ఉంది. సన్‌రైజర్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో బౌలర్లు పూర్తిగా తేలిపోయాడు. దీంతో హైదరాబాద్ ఏకంగా 287 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సిరాజ్ ఈ సీజన్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా తన స్థాయికి తగ్గ బౌలింగ్‌లో ప్రదర్శించలేక పోయాడు. అతని వైఫల్యం కూడా బెంగళూరు వరుస ఓటములకు ఒక కారణంగా చెప్పొచ్చు. జట్టులో దినేశ్ కార్తీక్, కోహ్లిలు మాత్రమే నిలకడగా రాణిస్తున్నారు. ఇతర ఆటగాళ్లు విఫలం కావడం బెంగళూరుకు ప్రతికూలంగా తయారైంది. ఇప్పటికే ఆరు మ్యాచుల్లో ఓడిన బెంగళూరు ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఇలాంటి స్థితిలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప నాకౌట్‌కు అర్హత సాధించడం దాదాపు కష్టమేనని చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News