Saturday, November 23, 2024

సమరోత్సాహంతో సన్‌రైజర్స్….. నేడు బెంగళూరుతో సమరం

- Advertisement -
- Advertisement -

RCB play with SRH
ముంబై: వరుస విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో నెగ్గిన సన్‌రైజర్స్ మరో విజయంపై కన్నేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ హైదరాబాద్ జయకేతనం ఎగుర వేస్తోంది. చివరిగా ఆడిన నాలుగు పోటీల్లోనూ సన్‌రైజర్స్ జయభేరి మోగించింది. బౌలర్లు అద్భుత ప్రదర్శనతో జట్టుకు అండగా నిలుస్తున్నారు. ప్రత్యర్థి జట్లను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో హైదరాబాద్ బౌలర్లు సఫలమవుతున్నారు. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. యువ బౌలర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వారు మరింత మెరుగ్గా బౌలింగ్ చేసేతా తనవంతు సహకారం అందిస్తున్నాడు. యువ సంచలనం ఉమ్రాన్ మాలిక్ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తిస్తున్నాడు. కిందటి మ్యాచ్‌లో ఉమ్రాన్ అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయాడు. ఈ క్రమంలో నాలుగు వికెట్లను పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకొంది. నటరాజన్ కూడా మెరుగైన బౌలింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఇక బ్యాటింగ్‌లో హైదరాబాద్ సమష్టిగా రాణిస్తోంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, కెప్టెన్ విలియమ్సన్ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరూ రాణిస్తూ జట్టుకు అండగా ఉంటున్నారు. అభిషేక్ దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక రాహుల్ త్రిపాఠి భీకర ఫామ్‌లో ఉన్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోతున్నాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి జట్ల బౌలర్లను హడలెత్తిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా త్రిపాఠి జట్టుకు చాలా కీలకంగా మారాడు. ఐడెన్ మార్‌క్రామ్ కూడా నిలకడైన బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ అసాధారణ రీతిలో రాణిస్తున్నాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా బ్యాటింగ్ చేస్తూ జట్టును గెలిపిస్తున్నాడు. ఇక నికోలస్ పూరన్ కూడా మెరుగ్గానే ఆడుతున్నాడు. ఇలా టాప్ ఆర్డర్‌లోనూ ప్రతి బ్యాట్స్‌మన్ తమవంతు సహకారం అందిస్తుండడం సన్‌రైజర్స్‌కు సానుకూల అంశంగా మారింది. ఈ మ్యాచ్‌లో కూడా సమష్టిగా రాణించి ఐదో విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో హైదరాబాద్ ఉంది.
వరుస విజయాలతో..
మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలను సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లోనూ విజయమే లక్షంగా పెట్టుకొంది. కెప్టెన్ డుప్లెసిస్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. మాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్. షాబాజ్ అహ్మద్, ప్రభుదేశాయ్ తదితరులు నిలకడగా రాణిస్తున్నారు. కార్తీక్ అద్భుత ఫామ్‌లో ఉండడం బెంగళూరుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. అయితే సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఈసారైనా కోహ్లి తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సిరాజ్, హాజిల్‌వుడ్, హర్షల్ పటేల్, హసరంగా, షాజాబ్, మాక్స్‌వెల్ తదితరులతో బెంగళూరు బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయమనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News