Monday, December 23, 2024

సమరోత్సాహంతో బెంగళూరు

- Advertisement -
- Advertisement -

నేడు కోల్‌కతాతో పోరు
బెంగళూరు: సొంత గడ్డపై శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే పోరుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సమరోత్సాహంతో సిద్ధమైంది. కిందటి మ్యాచ్‌లో పంజాబ్‌పై అద్భుత విజయం సాధించిన బెంగళూరు ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలనే లక్షంతో కనిపిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. బెంగళూరును కూడా ఓడించి రెండో విజయాన్ని అందుకోవాలనే లక్షంతో ఉంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్‌తో బెంగళూరును ఆదుకున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అయితే కెప్టెన్ డుప్లెసిస్, కామెరూన్ గ్రీన్, మ్యాక్స్‌వెల్‌ల వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా కలిగిన బ్యాటర్లు బెంగళూరుకు అందుబాటులో ఉన్నారు.

అయితే కీలక బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించక పోవడం జట్టును కలవరానికి గురి చేస్తోంది. కోహ్లితో పాటు డుప్లెసిస్, గ్రీన్, మ్యాక్స్‌వెల్ తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. అప్పుడే బెంగళూరుకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇక కిందటి మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన దినేశ్ కార్తీక్ ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. మరోవైపు సిరాజ్, యశ్ దయాల్, అల్జరీ జోసెఫ్, గ్రీన్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

ఆత్మవిశ్వాసంతో..

మరోవైపు కోల్‌కతా కూడా ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోల్‌కతా బలంగా ఉంది. అయితే ఆరంభ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు నరైన్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, కెప్టెన్ శ్రేయస్‌అయ్యర్ తదితరులు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సి ఉంటుంది. ఇక సన్‌రైజర్స్‌పై విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిన ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఈసారి కూడా రస్సెల్ నుంచి ఇలాంటి ప్రదర్శనే జట్టు ఆశిస్తోంది. రమన్‌దీప్, రింకు సింగ్‌లతో కోల్‌కతా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక సునీల్ నరైన్, మిఛెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో కోల్‌కతా కూడా విజయమే లక్షంగా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News