నేడు ఐపిఎల్ సీజన్ 18 తొలి పోరు
కోల్‌కతా: ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025కి శనివారం తెరలేవనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. శనివారం ఆరంభమయ్యే మెగా టోర్నమెంట్ మే 25న కోల్‌కతాలోనే జరిగే ఫైనల్‌తో ముగుస్తోంది. ఐపిఎల్ కోసం బిసిసిఐ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్‌లో మొత్తం పది జట్టు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. తొలి మ్యాచ్‌లో పటిష్టమైన కోల్‌కతాతో బెంగళూరు తలపడుతుంది. ఇరు జట్లు కూడా కొత్త సారథుల నేతృత్వంలో బరిలోకి దిగుతున్నాయి. కోల్‌కతాకు అజింక్య రహానె, బెంగళూరుకు యువ ఆటగాడు రజత్ పటిదార్ సారథ్యం వహిస్తున్నారు. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లు రెండు జట్లలోనూ ఉన్నారు.
విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, పటిదార్,దేవ్‌దుత్ పడిక్కల్, జితేశ్ శర్మ, లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, హాజిల్‌వుడ్, ఎంగిడి వంటి స్టార్ క్రికెట్లు బెంగళూరులో ఉన్నారు. మాజీ ఆటగాడు దినేశ్ కార్తీక్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇది కూడా బెంగళూరుకు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. ఇక ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఐపిఎల్‌లోనే అత్యంత సీనియర్ ఆటగాడిగా పేరున్న కోహ్లి జట్టుకు కీలకంగా మారాడు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. ఫిలిప్ సాల్ట్, లివింగ్‌స్టోన్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని ముందుకు సాగే సత్తా వీరికి ఉంది. కోహ్లి, పడిక్కల్, పటిదార్, టిమ్ డేవిడ్‌లతో కూడిన పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ బెంగళూరుకు సానుకూల అంశంగా మారింది. అంతేగాక భువనేశ్వర్, హాజిల్‌వుడ్, తుషారా, స్వప్నిల్, యశ్ దయాళ్, ఎంగిడి వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడ జట్టులో ఉన్నారు. ఇక టోర్నమెంట్ ఆరంభం నుంచి ఆడుతున్నా బెంగళూరు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీని సాధించలేదు. ఈ సీజన్‌లో మాత్రం ఆ లోటును తీర్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లోనూ గెలిచి టోర్నమెంట్‌కు శ్రీకారం చుట్టాలనే పట్టుదలతో ఉంది.
స్టార్ ఆటగాళ్ల కలయిక..
మరోవైపు కోల్ కతా టీమ్‌లో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రి రసెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అన్రిచ్ నోర్జే, స్పెన్సర్ జాన్సన్, మనీశ్ పాండే, మోయిన్ అలీ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇక కెప్టెన్ అజింక్య రహానె జట్టుకు జట్టుకు కీలకంగా మారాడు. అపార అనుభవం ఉన్న రహానె జట్టును ముందుండి నడిపించాలనే లక్షంతో ఉన్నాడు. డికాక్, నరైన్, రసెల్, రింకు సింగ్ వంటి విధ్వంసక బ్యాటర్లు ఉండడం కోల్‌కతాకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. వరుణ్ చక్రవర్తి, రసెల్, జాన్సన్, మార్కండే, చేతన్ సకరియా, నోర్జే వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టుకు అందుబాటులో ఉన్నారు. రెండు విభాగాల్లో సమతూకంగా ఉన్న కోల్‌కతా ఈసారి కూడా టైటిల్ ఫేవరెట్‌లలో ఒకటిగా కనిపిస్తోంది. ఆరంభ మ్యాచ్‌లో గెలిచి టైటిల్ వేటకు శ్రీకారం చుట్టాలనే లక్షంతో కనిపిస్తోంది. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.