Monday, December 23, 2024

ఢిల్లీ మళ్లీ పాత కథే వరుసగా ఐదో ఓటమి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు జయకేతనం

బెంగళూరు: ఐపిఎల్ సీజన్16లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా ఐదో ఓటమిని చవిచూసింది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 23 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఈ సీజన్‌లో ఢిల్లీ ఆడిన ఐదు మ్యాచుల్లోనూ పరాజయాలను మూట గట్టుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ ప్లేఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టంగా మార్చుకుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ పృథ్వీషా తన పేలవమైన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తూ సున్నాకే ఔటయ్యాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన మిఛెల్ మార్ష్ (0) కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే యశ్ ధూల్ (1) కూడా వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఢిల్లీ మళ్లీ కోలుకోలేక పోయింది. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ 4 ఫోర్లతో 19 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. వికెట్ కీపర్ అభిషేక్ పొరెల్ (5) కూడా జట్టును ఆదుకోలేక పోయాడు. మరోవైపు మనీష్ పాండే ఒంటరి పోరాటం చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మనీష్ పాండే 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు సాధించాడు. మిగతా వారిలో అక్షర్ పటేల్ (21), అమాన్ హకీమ్ ఖాన్ (18), అన్రిచ్ నోర్జే 23 (నాటౌట్) మాత్రమే కాస్త రాణించారు. ఇక ప్రత్యర్థి జట్టు బౌలర్లలో విజయ్ కుమార్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు.

ఆదుకున్న కోహ్లి

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు ఓపెనర్ విరాట్ కోహ్లి అండగా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న కోహ్లి జట్టుకు శుభారంభం అందించాడు. మరోవైపు ధాటిగా ఆడిన కెప్టెన్ డుప్లెసిస్ 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు చేశాడు. ఇక కీకల ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 34 బంతుల్లోనే ఆరు ఫోర్లు, సిక్సర్‌తో 50 పరుగులు సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన లామ్‌రోర్ (26), మాక్స్‌వెల్ (24) పరుగులు చేశారు. ఇక షాబాజ్ అహ్మద్ 20 (నాటౌట్), అనుజ్ రావత్ 15 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించడంతో బెంగళూరు స్కోరు 174 పరుగులకు చేరింది. హాఫ్ సెంచరీతో అలరించిన కోహ్లికి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News