మనతెలంగాణ/హైదరాబాద్ : అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో కస్టోడియల్ మృతిపై హైకోర్టులో గురువారం నాడు విచారణ జరిగింది. మరియమ్మ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. రీ పోస్టుమార్టం నివేదికను సీల్డు కవర్‌లో పెట్టి సమర్పించాలని సూచించింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం పోలీస్‌స్టేషన్‌లో సిసి కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.ఈనెల 18న ఒక దొంగతనం కేసులో మరియమ్మను పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేయడంతోనే ఆమె చనిపోయిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. రూ. 5కోట్లు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. కాగా లాకప్ డెత్ కేసులో పోలీసులపై రాచకొండ సిపి మహేష్ భగవత్ అడ్డగూడూరు ఎస్‌ఐ మహేష్, కానిస్టేబుల్స్ రషీద్, జానయ్యలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
సిపికి హెచ్‌ఆర్‌సి నోటీసులు
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు కస్టోడియల్ డెత్‌పై నివేదిక సమర్పించాలని రాచకొండ సిపి మహేశ్ భగవత్‌కు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ బహుజన విద్యార్థి సమాఖ్య హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై జులై 28 లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ మహేష్ , కానిస్టేబుళ్లు రషీద్, జానయ్య విచక్షణారహితంగా కొట్టడం వల్లే ఆమె చనిపోయిందని ఎస్‌సి, ఎస్‌టి సంఘాల నాయకులు గణేశ్, మద్దెల ప్రవీణ్, రాంబాబులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. రాచకొండ సీపీ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వారిపై సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులిపేసుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని మానవ హక్కుల కమిషన్‌ను వారు కోరారు.