Friday, March 21, 2025

గగన్ యాన్ వైపు ప్రపంచం చూపు

- Advertisement -
- Advertisement -

భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్షయాత్ర గగన్‌యాన్ వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. మొత్తం నలుగురు వ్యోమగాములు ఈ యాత్రకు సిద్ధమవుతున్నారు. తొమ్మిది నెలలపాటు సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వ్యోమగాములు సురక్షితంగా బుధవారం భూమిపైకి చేరుకున్న తరువాత ఇప్పుడు భారత్ గగన్‌యాన్ చర్చ తెరమీదకు వచ్చింది. గగన్‌యాన్‌లో నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలో ఏ విధంగా తమ లక్షాలను సాధిస్తారన్న చర్చ జరుగుతోంది. తొమ్మిది నెలల్లో సునీతా, విల్మోర్ ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని గగన్‌యాన్ యాత్రలోని భారత వ్యోమగాములకు అంతరిక్షంలో ఆరోగ్య సమస్యలను నివారించాలంటే ఏం చేయాలని శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. శాస్త్రవేత్తల వివరాల ప్రకారం గురుత్వాకర్షణ లోపం వల్ల అంతరిక్షంలో వ్యోమగాములు ఎముకలు, కండరాలు క్షీణిస్తాయి. ప్రతి 30 రోజులకు ఎముకలు 12 శాతం వరకు సాంద్రతను కోల్పోతాయి. ఆరు నెలల్లో ఇది 10 శాతం వరకు పెరగవచ్చు. భూమికి తిరిగి వచ్చాక వ్యోమగాముల్లో ఎముకల సాంద్రత తిరిగి సాధారణ స్థాయికి రావడానికి నాలుగేళ్లు పట్టవచ్చు. అలాగే రోదసీలో ఉన్నప్పుడు రెండు వారాలు గడిచాక కండరాలు 20 శాతం వరకు క్షీణించవచ్చు.

గురుత్వాకర్షణకు సంబంధించిన సమాచారాన్ని మెదడుకు చేరవేసే చెవిలోని వెస్టిబ్యులర్ అవయవ ప్రక్రియ కూడా దెబ్బతింటుంది. వ్యోమగాముల తలభాగంలో అధికంగా చేరే ద్రవాల కారణంగా దృష్టి లోపాలు ఏర్పడవచ్చు. గుండె, మెదడు, రక్త ప్రసరణ వ్యవస్థల్లో తేడాలు కనిపిస్తాయి. భూకక్ష లోని రేడియో ధార్మికత వల్ల తెల్లరక్తకణాలు తగ్గిపోయి, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడవచ్చు. వీటన్నిటికీ తోడు మూత్రపిండాల్లో రాళ్ల సమస్య వీరిని ఎక్కువగా వేధిస్తుంది. ఈ పరిష్కారం కోసం భారత్‌లో పరిశోధనలు చేపడుతున్నారు. ఎముకల నుంచి కాల్షియం అధికంగా నష్టపోవడం, మూత్రంలో ఆమ్ల పరిమాణం అధికంగా ఉండటం, తదితర కారణాల వల్ల వ్యోమగాముల్లో మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఏర్పడుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఎముకల నుంచి కాల్షియం విడివడి మూత్రపిండాల్లో పేరుకుని రాళ్లుగా మారతాయని అంటున్నారు. అందుకే అంతరిక్షంలో మానవ మూత్రపిండాల్లో వచ్చే మార్పులపై అధ్యయనం చేయడానికి ఫ్రూట్‌ఫ్లై (పండుటీగలు)లను ఎంచుకున్నారు. ఈ పండుటీగల శరీర నిర్మాణం మానవ శరీర నిర్మాణానికి దగ్గరగా ఉంటుంది. మానవుల్లో వ్యాధులు కలిగించే జన్యువులను పోలినవి పండుటీగల్లో 77 శాతం ఉంటాయి. జన్యుకూర్పు, పనితీరు, నిర్మాణ పరంగా పండుటీగల్లో మాల్ఫీజియన్ నాళిక మానవ మూత్రపిండాలను పోలి ఉంటుంది. గగన్‌యాన్ యాత్రలో ఫ్రూట్‌ఫ్లైలను అంతరిక్షంలోకి తీసుకెళ్లి అధ్యయనం చేస్తారు.

దీనికోసం ఐఐఎస్‌టి ఒక ప్రత్యేక కిట్‌ను రూపొందించింది. ఇందులో 20 సండుటీగలకు చోటు కల్పిస్తారు. భూమ్యాకర్షణ శక్తి ఏమాత్రం లేని వాతావరణంలో ఈ పండుటీగల శరీరాల్లో కలిగే మార్పులు అనేక కొత్త విషయాలను బహిర్గతం చేసే అవకాశం ఉంది. ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో మానవ అంతరిక్షయానాన్ని మరింత సులభతరం చేయడానికి దోహదం చేస్తాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. గగన్‌యాన్‌లో ఈ విధమైన జీవ పరిశోధన చేపట్టడం భారత్‌కు గర్వకారణమవుతుంది. ఇక గగన్‌యాన్‌కు సంబంధించి భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా చరిత్ర సృష్టించనున్నారు. 40 ఏళ్ల తరువాత మరోసారి భారతీయులు అంతరిక్షంలోకి వెళ్లనుండటం విశేషం.

ఇప్పటివరకు భారత దేశం నుంచి కేవలం వింగ్ కమాండర్ రాకేష్ శర్మ మాత్రమే 1984లో సోవియట్ యూనియన్ సాయంతో అంతరిక్షంలోకి వెళ్లారు. ఇస్రో హ్యూమన్‌స్సేస్ ఫ్లైట్ సెంటర్, అమెరికాకు చెందిన అక్సియోమ్ స్పేస్‌తో ఒప్పందం కుదుర్చుకుని భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిస్తుంది. దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తయిన కక్షలోకి చేర్చి, మూడు లేదా ఐదు రోజుల తరువాత తిరిగి భూమిపైకి తీసుకురావాలన్నదే ఈ ప్రయోగం ముఖ్యలక్షం. వాస్తవానికి 2022 లోనే ఈ ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. ముందుగా అనుకున్నట్టు 2025లో కాకుండా 2026లో దీనిని చేపట్టడానికి నిర్ణయించారు.

గగన్‌యాన్ వ్యోమనౌక భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో భూమ్యాకర్షణ శక్తి ఏమాత్రం లేని (జీరో గురుత్వాకర్షణ) పరిస్థితుల్లో భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. భూమి చుట్టూ మూడు నుంచి అయిదు రోజుల వరకు తిరిగి వ్యోమనౌక గుజరాత్ తీరంలోని తన స్థావరానికి చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ అంతరిక్ష పరిశోధన వల్ల అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తా యి. భూవాతావరణం, ప్రకృతి విపత్తులు, కాంతి కాలుష్యం, తదితర అంశాలపై పరిశోధనలకు వీలవుతుంది. అంతేకాక, సంక్లిష్టమైన వ్యాధులు రూపాంతరం చెందడం, ఔషధాలపై ప్రయోగాలు, వ్యాధి నిర్ధారణ సాధనాల తయారీకి దోహదం కలుగుతుంది. అందుకనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్వహణకు 15 దేశాలు ఏటా 300 కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News