Monday, December 23, 2024

మోడీ కళ్లల్లో భయం చూశా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జైలుశిక్షలకు, అనర్హతా వేటుకు తాను భయ పడేది లేదని, దేనికైనా తెగించి ప్రజాస్వామ్యం కోసం పోరాడుతానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం స్పష్టం చేశారు. వయనాడ్ పార్లమెంట్ స్థానంలో అనర్హత వేటు తరువాత తొలిసారిగా రాహుల్ ఇక్కడి కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ మాజీ అధ్యక్షులు అయిన రాహుల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ నుంచి శాశ్వతంగా వెలివేయబడ్డా, జీవితాంతం జైలు పాలయినా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు తన పోరు ఆగబోదని ఆయన తెలిపారు. దేశానికి ప్రజాస్వామిక వ్యవస్థ కీలకం,దీనిని తాను ప్రజాస్వామిక ప్రకృతి లక్షణంగా భావిస్తానని చెప్పారు. ఈ కేంద్ర ప్రభుత్వానికి నిజాలంటే భయాలు ఉన్నాయి.

వీరికి నిజాలు మాట్లాడేవారంటే భయాలు, నిజాలు నిగ్గుదేలాలనే ఇతరుల ప్రయత్నాలు అంటే వణుకు అని తెలిపిన రాహుల్ ఇప్పుడు ప్రధాని మోడీకి భయం పట్టుకుందని, ఆయన కళ్లలో భయాలు కనపడుతున్నాయని తెలిపారు. భయకంపిత ప్రభుత్వం ఇప్పుడు తనపై అనర్హత వేటు విధించడం ద్వారా చేజేతులా ప్రతిపక్షానికి ఓ పదునైన ఆయుధాన్ని అందించినట్లు అయిందని చెప్పారు. తాను పార్లమెంట్‌లో ప్రసంగిస్తే అదానీపై దీని వెనుక ఉన్న మోడీపై నిజాలు తెలుస్తాయని ప్రభుత్వానికి భయం ఉందన్నారు. అదానీ విషయంపై తాను పార్లమెంట్‌లో చేయబోయే తదుపరి ప్రసంగం వాడీవేడిగా ఉంటుందనే భయం ప్రధానికి పట్టుకుందని , అందుకే ఇప్పుడు తనను పార్లమెంట్‌కు వెళ్లకుండా వేటేశారని రాహుల్ తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ దిశలో తనకు ఈ వేటు, జైలుశిక్ష లెక్కలోకి రాదని ఆయన పూర్తి స్థాయి ధిక్కార స్వరం విన్పించారు.

ప్రజలను ఈ విషయం నుంచి మళ్లించడానికి ఈ విధంగా మొత్తం సయ్యాటకు దిగారని, తనకు జైలు శిక్ష తరువాత వెంటనే అనర్హత వేటు పడటం ఇవన్నీ ఇందులో భాగాలని తెలిపారు. ఇంతకూ అదానీకి చెందిన పలు బోగస్ కంపెనీలలో ఇటీవలి కాలంలో రూ 20000 కోట్ల మేర పెట్టుబడులు వచ్చిపడ్డాయి. ఇవి ఎక్కడివి? ఎక్కడి నుంచి వచ్చాయి? అనేది ప్రధాన ప్రశ్న. సమాధానం లేని ప్రశ్నగా ఉందని. దీనిని తాను లేవనెత్తుతూనే ఉంటానని రాహుల్ తెలిపారు. భారతీయుల ప్రజాస్వామిక గొంతుకను నిలబెట్టెందుకు తాను ఇక్కడ సిద్ధంగా ఉన్నానని రాహుల్ ప్రకటించారు.

ఇంతకు ముందు ఇదే చేశా, ఇక ముందు కూడా ఇదే చేస్తానని ఈ క్రమంలో ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. బెదరగొట్టడం, అనర్హత వేటుకు గురి చేయడం , ఆరోపణలు , జైలుశిక్షలకు భయపడనని, భయపడుతానని అనుకునే వారికి తాను అర్థం అయ్యే వ్యక్తిని కానని తెలిపారు. వారికి తాను ఎప్పుడూ బెదిరేది లేదన్నారు.
అదానీకి, మోడీకి సంబంధం ఏమిటనేదే ప్రధాన ప్రశ్న
వ్యాపారవేత్త అందులోనూ పలు అక్రమాలకు దిగినట్లు ఆరోపణలు ఉన్న వ్యక్తి అదానీతో ప్రధాని మోడీకి ఉన్న సంబంధాలు ఏమిటనేదే తన సశేష ప్రశ్న అని దీనిని జవాబు దొరికే వరకూ అడుగుతూ ఉంటానని తెలిపారు. తరువాతి ప్రసంగం లోక్‌సభలో ఏ విధంగా ఉంటుందో అనే భయం మోడీకి పట్టుకుంది. దీనితోనే తనపై వేటుకు ఈ విధంగా రంగం సిద్ధం చేశారు. రాహుల్ వెంట విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు అశోక్ గెహ్లోట్, భూపేష్ బఘేల్, జైరాం రమేష్, కెసి వేణుగోపాల్ ఉన్నారు. తన సభ్యత్వం పునరుద్ధరణ జరుగుతుందని నమ్ముతున్నారా? అని విలేకరులు రాహుల్‌ను ప్రశ్నించగా తాను ఇటువంటి నమ్మకాలు ఆకాంక్షలపై నమ్మకాలు లేని వాడినని స్పష్టం చేశారు.

తాను తన ఎంపి సీటు తిరిగి పొందినా పొందకపోయినా తన విధి నిర్వర్తిస్తానని తెలిపారు. పార్లమెంట్‌లో ఉన్నా బయట ఉన్నా తన పోరాటం సాగుతుందన్నారు. తనకు సంఘీభావం ప్రకటించిన ఇతర ప్రతిపక్ష నేతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని ప్రకటించారు. కలిసికట్టుగా ముందుకు సాగాల్సి ఉందన్నారు. నిజానికి అధికార పక్షం నుంచి ఇప్పుడు విపక్షానికి మంచి ఆయుధం అందినట్లు అయిందని , ఇక నిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. బిజెపి సారథ్యపు ప్రభుత్వానికి దేశమంటే అదానీ , అదానీ అంటే దేశం అయిందని అయితే తమకు దేశమంటే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అంటే ప్రజలని తేల్చిచెప్పారు.
సావర్కర్‌ను కాదు… గాంధీని
తాను గాంధీని అని, సావర్కర్ తోక పేరు లేని వాడినని.. జరిగినదానికి క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని రాహుల్ స్పష్టం చేశారు. తనపై దాఖలు అయిన కేసు గురించి విలేకరులు ప్రశ్నించగా కోర్టుల్లోని అంశం అయినందున తాను ఈ దశలో దీనిపై స్పందించడం లేదని, దీనిపై తన న్యాయనిపుణుల బృందాలు చూసుకుంటాయని వివరించారు. అదానీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బిజెపి ఒబిసిలపై రాహుల్ అవమానకర మాటలకు దిగారని ఆరోపిస్తోందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News