Monday, December 23, 2024

షరతులు అంగీకరిస్తే తక్షణమే దాడులు విరమిస్తాం

- Advertisement -
- Advertisement -

Readiness to suspend military action against Ukraine

 

మాస్కో: ఉక్రెయిన్‌పై 12 రోజులుగా విరుచుకుపడుతున్న రష్యా సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను నిలిపివేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే అందుకు కొన్ని షరతులు కూడా విధించింది. యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో వేడుకుంటున్నా పెడచెవిన పెట్టిన రష్యా ఓ వైపుఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది.ఆర్థిక ఆంక్షలను సైతం లెక్క చేయకుండా విరుచుకు పడుతోంది. ఈ నేపథ్యంలో రష్యా ఈ కీలక ప్రకటన చేయడం గమనార్హం. తమ షరతులకు గనుక అంగీకరిస్తే తక్షణం సైనిక చర్యను ఆపేస్తామన్నది ఆ ప్రకటన సారాంశం.

అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియా కార్యదర్శి దిమిత్రీ పెస్కోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య మూడో విడత చర్చలు ప్రారంభం కావడానికి కొద్దిగంటల ముందు ముందు ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. ‘ ఉక్రెయిన్‌పై తక్షణం సైనిక చర్యను ఆపేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే అందుకు ఉక్రెయిన్ మా షరతులకు అంగీకరించాల్సి ఉంటుంది’ అని పెస్కోవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ తన రాజ్యాంగాన్ని సవరించాలని, అది ఏ కూటమిలోనూ చేరకుండా అది అడ్డుకునేలా ఉండాలని పెస్కోవ్ స్పష్టం చేశారు. ఈ షరతులకు గనుక ఉక్రెయిన్ అంగీకరిస్తే తక్షణమే సైనిక చర్యను నిలిపివేస్తామని ప్రకటించారు.

406 మంది ఉక్రెయిన్లు మృతి:ఐరాస

ఇదిలా ఉండగా రష్యా దండయాత్ర మొదలైనప్పటినుంచి ఉక్రెయిన్‌లో 406 మంది పౌరులు మృతి చెందినట్లు ఐరాస మానవ హక్కుల కార్యాలయం పేర్కొంది. ఆదివారం నాటికి మరో 801 మంది గాయపడినట్లు తెలిపింది. కాగా గడచిన 11 రోజుల్లో 17 లక్షల మంది ఉక్రెయిన్ వీడారని ఐరాస శరణార్థుల ఏజన్సీ వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత వేగంగా పెరుగుతున్నమానవ సంక్షోభం ఇదేనని తెలిపింది. ఈ అర్థం లేని సంఘర్షణకు తక్షణమే ముగింపు పలకని పక్షంలో రాబోయే రోజుల్లో లక్షలాది మంది జీవితాలు ఛిన్నాభిన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా ఉక్రెయిన్ దళాలు రష్యాబలగాలనుంచి మైకోలాయివ్ ప్రాంతీయ విమానాశ్రయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక గవర్నర్ విటాలి కిమ్ సోమవారం తెలిపారు. ఈ పోరులో ఇద్దరు రష్యన్ ఉన్నతస్థాయి అధికారులు మృతి చెందినట్లు తెలిపారు.

మేయర్ కాల్చివేత

రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని గోస్టోమెల్ మేయర్‌ను కాల్చి చంపినట్లు సోమవారం స్థానిక అధికారులు తెలిపారు. మేయర్ యూరి ఇల్లిచ్ ప్రైలిప్కో స్థానికంగా ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం, రోగులకు మందులు పంపిణీ చేస్తున్నప్పుడు ఆయనతో పాటు మరిద్దరిని కాల్చి చంపినట్లు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News