Wednesday, January 22, 2025

ఇక నుంచి మంచైనా, చెడైనా కలిసి పనిచేస్తాం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారానికి ఉమ్మడిగా ప్రజా ఉద్యమాలను చేపడతామని, రాబోయే ఎన్నికల్లో కలిసే ముందుకు సాగుతామని ఉభయ కమ్యూనిస్టు ముఖ్య నేతలు ప్రకటించారు. ఇరు పార్టీల మధ్య మరింత ఐక్యత దిశగా ఈ నెల 9న హైదరా బాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ‘ సిపిఐ, సిపిఐ(ఎం) మండల స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి నాయకుల సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీ శ్రేణులను మరింత ఐక్యపర్చేందుకు , రాబోయే రాజకీయాల పెనుమార్పులకు, మంచి పరిణామాలకు ఈ సమ్మేళనం ఎంతో దోహదపడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. రాష్ట్రంలో బిజెపిని అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు. హైదరాబాద్ మగ్ధుంభవన్ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జాన్ వెస్లీతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని సాంబ శివరావు, తమ్మినేని వీరభద్రం మాట్లాడారు.

‘ సిపిఐ, సిపిఐ(ఎం) సభ’ కు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, సిపిఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు తదితరులు హాజరుకానున్నట్టు వారు తెలిపారు . తెలుగు రా్రష్ట్రాల చరిత్రలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల సమ్మేళనం జరగడం ఇదే తొలిసారి అని, ఈ సమావేశానికి పెద్ద ఎత్తున ఉభయ పార్టీల శ్రేణులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాల కార్యా చరణ ఉంటుందన్నారు. రాహల్ లోక్‌సభ సభ్యత్వాన్ని తొలగించడాన్ని వారు ఖండించారు. వెంటనే ఆయనపై అనర్హత వేటును తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సిట్, కేంద్ర దర్యాప్తు సంస్థలపై అనేక అపోహాలు వస్తున్న నేపథ్యంలో పేపర్ లిక్ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జీతో సమగ్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు బిఆర్ మద్దతిచ్చి గెలిపించిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

సిపిఐ,సిపిఎం అన్నదమ్ముల్లాగా ఉన్నామని, మంచైనా, చెడైనా ఇక కలిసే ముందుకు నడుస్తా మని,రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి వంతమైన పాత్ర వహించగలమని చెప్పారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిస్తే 40 నుండి 50 స్థానాలల్లో గెలిపించే, ఓడించే శక్తి ఉన్నదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజాస్వామ్యపరిరక్షణకు, బిజెపి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బిఆర్‌ఎస్ వ్యవహారిస్తున్న నేపథ్యంలోనే ఆ పార్టీతో కలుస్తామని, సీట్ల సర్దు బాటు అంశంలో మాట్లాడుకోలేదని, సీట్లు అడగలేదని స్పష్టం చేశారు. మును గోడులో బిఆర్ మద్దతు ఇవ్వకపోతే బిజెపి దొడ్డిదారిని ప్రవేశిస్తే, రాష్ట్రానికి ప్రమాదం వాటిల్లదేనని, ఇది పత్రికరంగంపైనా ప్రభావం చూపేదని చెప్పారు. ఇప్పటికే బిజెపి మీడియా సంస్థలను కొనుగోలు చేస్తోందని , అన్ని శాఖలకు బిజెపి ఒక క్యాన్సర్ విస్తరించే ప్రమాదం ఉన్నదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News