ఫహల్‌గామ్‌లో ఈ నెల 22వ తేదీన ఉగ్రవాదులు మారణకాండ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టింది.. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులే అని అందరికీ తెలుసు. ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండించిన దేశ ప్రజలు పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కేంద్రం కూడా పాకిస్థాన్‌పై ప్రతిదాడిని ప్రారంభించింది. సింధు జలలా ఒప్పందం నిలిపివేత.. భారత్‌లో నివసిస్తున్న పాక్ పౌరుల వీసా రద్దు వంటి చర్యలను చేపట్టింది.
కానీ, పాక్ ప్రధాని మాత్రం తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. పహల్‌గామ్ ఉగ్రవాద దాడిపై విచారణకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. తటస్థ, పారదర్శక, విశ్వసనీయ విచారణకు సిద్ధమని ఆయన తెలిపారు. బాధ్యతాయుత దేశంగా విచారణలో పాల్గొంటామని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరులో తమదేశం ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు.