చత్తీస్‌గఢ్ మావోయిస్టుల ప్రకటన
దంతేవాడ : చత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో షరతులతో కూడిన చర్చలకు తాము సిద్ధం అని నిషేధిత మావోయిస్టులు శనివారం ప్రకటించారు. అయితే ఇందుకు ముందుగా జైళ్లలోని తమ నేతలను విడిచిపెట్టాలి. కల్లోలిత ప్రాంతాల పేరిట కొన్ని చోట్ల దింపిన బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని పేర్కొంటూ మరిన్ని షరతులను మావోయిస్టులు ప్రభుత్వం ముందుకు పంపించింది. హింసను వీడి చర్చలకు రావాలని మావోయిస్టులకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం శాంతి ప్రతిపాదన పంపించింది. దీనికి నిషేధిత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టులు) స్పందించారు. రాష్ట్రంలోని భూపేష్ బఘేల్ ప్రభుత్వంతో చర్చలకు వస్తామని అయితే ముందుగా జైళ్లలో మగ్గుతున్న తమ సోదరులను విడిచిపెట్టాలని వారు డిమాండ్ చేశారు. అయితే షరతులతో చర్చలకు వస్తామంటే అంగీకరించేది లేదని, బేషరతు చర్చలకు రావాల్సిందేనని రాష్ట్ర మంత్రి ఒక్కరు స్పష్టం చేశారు. చర్చలకు సిద్ధమేనని రెండు పేజీల ప్రకటనను దండకారణ్య ప్రాంత నక్సల్స్ కమిటీ పేరిట వికల్ప్ పేరిట సంతకంతో వెలువరించారు.