హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించాయి. అయితే.. అధికార బీఆర్ఎస్ మినహా.. మిగతా పార్టీలు ఏవీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ కుమార్తె వెన్నెల కూడా ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది.
అయితే.. ఈ వార్తలపై వెన్నెల స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని వెన్నెల చెప్పారు. తాను కంటోన్మెంట్ లోనే పుట్టి పెరిగానని చెప్పిన వెన్నెల.. కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే ఈసారి పోటీ చేస్తారా అని చాలా మంది అడుగుతున్నారు అందుకే క్లారిటీ ఇవ్వాలన్నారు. నాన్న ఆశయ సాధన కోసం రాజకీయాల్లో రావాలనుకుంటున్నానని చెప్పారు. గద్దర్ జీవితాంతం సమసమాజం కోసం తపన పడ్డారన్నారు. టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ కే మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు.
నా కుమారైకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే ప్రచారం చేస్తానని గద్దర్ భార్య విమల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టిక్కెట్ ఇస్తామన్నారు తరువాత చప్పుడు చేయట్లేదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని అడుగుతున్న టిక్కెట్ ఇవ్వాలని.. నా కూతురును ప్రజలు గెలిపిస్తారని గద్దర్ భార్య విమల వెల్లడించారు.
ఇదిలా ఉంటే కంటోన్మెంట్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణంతో ఆయన కుమార్తె లాస్య నందితకు అధికార పార్టీ బీఆర్‌ఎస్ అవకాశం కల్పించింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఆమెను ఆశీర్వదించి ధైర్యం చెప్పారు. ఎలాంటి భయం లేకుండా ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. కచ్చితంగా గెలుస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఆమె తండ్రి మద్దతు.. ఆయన అకాల మరణం పట్ల ప్రజల్లో సానుభూతి కూడా ఉండడంతో.. లాస్య నందిత గెలుస్తుందన్న ధీమాతో గులాబీ పార్టీ ఉంది. చూద్దాం రెండు పార్టీలు.. సానుభూతి ఆధారంగా వారసులను బరిలోకి దింపితే ప్రజలు ఎవరిని దీవిస్తారో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.