బిజెపి కార్యకర్తల దాడిపై కేజ్రీవాల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: దేశంలోని అతి పెద్ద పార్టీ దౌర్జన్యానికి పాల్పడితే తప్పుడు సంకేతాలు వెళతాయని, అటువంటి పరిస్థితిలో దేశం పురోభివృద్ధి చెందలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బిజెపి యువజన విభాగానికి చెందిన కార్యకర్తలు బుధవారం కేజ్రీవాల్ నివాసం వెలుపల విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం కేజ్రీవాల్ స్పందిస్తూ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యం కాదని, ఈ దేశం ముఖ్యమని వ్యాఖ్యానించారు. దేశం కోసం తాను ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఆయన అన్నారు. ఇటువంటి దౌర్జన్యాల వల్ల దేశం అభివృద్ధి సాధించలేదని ఆయన చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న దేశంలోని అతి పెద్ద పార్టీ ఇటువంటి దౌర్జన్యానికి పాల్పడితే ప్రజలలో తప్పుడు సంకేతాలు వ్యాప్తి చెందుతాయని, ఇదే సరైన పద్ధతి(ఎటువంటి పరిస్థితినైనా ఇదే విధంగా ఎదుర్కోవాలి) అని వారు భావిస్తారని కేజ్రీవాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా..కేజ్రీవాల్ నివాసం వెలుపల జరిగిన సంఘటనను పురస్కరించుకుని 8 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.