Tuesday, September 17, 2024

గ్రేటర్‌లో పెరిగిన రియల్ జోరు

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం ఏర్పడిన ఏడునెలల్లో పెరిగిన రిజిస్ట్రేషన్లు
పుంజుకున్న కొత్త భవన నిర్మాణాలు
గతేడాదితో పోలిస్తే పెరిగిన ఆదాయం
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. భవనాలు, లే ఔట్ల అనుమతులతో పాటు ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హెచ్‌ఎండిఏ పరిధిలో ప్రాంతంలో జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం పెరిగాయి. కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతుల సంఖ్య కూడా పెరిగింది. ఎన్నికల కోడ్‌తో దాదాపు మూడు నెలల పాటు ఆర్థిక లావాదేవీలు స్తంభించినప్పటికీ గతేడాదితో పోలిస్తే స్థిరాస్థి రంగం పుంజుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు, మెట్రో రైలు విస్తరణ, సికింద్రాబాద్ నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం చేసే రెండు ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణంతో సిటీ రూపురేఖలు మారిపోనున్నాయి. మరోవైపు రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్‌ఎండిఏ పరిధిని విస్తరించే ప్రణాళికలు, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించటంతో స్థిరాస్థి రంగానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. గతంతో పోలిస్తే జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ పరిధిలో రిజిస్టేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది.

ఏడు నెలల్లో రూ.4,670.52 కోట్ల ఆదాయం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి 2023 డిసెంబర్ నుంచి జూన్ నెలాఖరు వరకు ఏడు నెలల్లో ప్లాట్లు భవనాల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.4,670.52 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకు ముందు ఏడు నెలల్లో మే 2023 నుంచి నవంబర్ 2023 వరకు వచ్చిన ఆదాయం రూ.4429.23 కోట్లు మాత్రమే. మొత్తంగా రూ.241.29 కోట్ల ఆదాయం పెరగటం గమనార్హం. రోజురోజుకు విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్‌లో స్థిరాస్థి రంగం వృద్ధికి ఇది సంకేతంగా చెప్పవచ్చు. గత సంవత్సరం (డిసెంబర్ 2022 నుంచి జూన్ 2023 వరకు) ఇదే వ్యవధితో పోల్చితే రూ. 270.86 కోట్లు ఎక్కువ కాగా, గత ఏడు నెలల్లో జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 2,18,160. గతేడాది ఇదే వ్యవధిలో 1,93,962 రిజిస్ట్రేషన్లు జరగ్గా ప్రస్తుతం 12.5 శాతం పెరిగాయి.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 54,111 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ జరిగింది. గతేఏడాది ఇదే వ్యవధిలో 50,535 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అప్పటితో పోలిస్తే 7 శాతం పెరుగుదల నమోదైంది. డిసెంబర్ 7వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ పరిధిలో అనుమతి ఇచ్చిన భవనాల దరఖాస్తుల సంఖ్య 18077. గతేడాది మే నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఇచ్చి భవన అనుమతుల సంఖ్య 17,911. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏడు నెలల్లో ఆమోదించిన భవన నిర్మాణ అనుమతులు 7,809 కాగా.. అంతకు ముందు ఏడు నెలలతో పోలిస్తే 13.17 శాతం పెరిగాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News