Tuesday, November 5, 2024

కొంపల్లిలో నవంబర్ 5,6వ తేదీల్లో క్రెడాయ్ ప్రోపర్టీ షో

- Advertisement -
- Advertisement -

గ్రిడ్ పాలసీతో రియల్ ఎస్టేట్‌కు పెరిగిన డిమాండ్ : క్రెడాయ్ అధ్యక్షులు పి. రామకృష్ణారావు


మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రిడ్ పాలసీతో రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ సైతం గణనీయంగా పెరుగుతుందని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షులు పి. రామకృష్ణారావు అన్నారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రెడాయ్ 12వ ప్రోపర్టీ షోను ఉత్తర హైదరాబాద్ కోసం కొంపల్లిలోని ఆస్పియస్ కన్వెన్షన్ సెంటర్‌లో నవంబర్ 5,6వ తేదీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్రెడాయ్ ప్రోపర్టీ బ్రోచర్‌ను జనరల్ సెక్రటరీ వి రాజశేఖర్‌రెడ్డి, వికాస్, శివరాజ్ ఠాకూర్‌లతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం రామకృష్ణారావు మాట్లాడుతూ నగరవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్థితో పాటుగా పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్న కారణంగా గృహ, వాణిజ్య రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగిందన్నారు.

క్రెడాయ్ ప్రోపర్టీ షోలో హైదరాబాద్ ఉత్తర ప్రాంతంలోని అత్యుత్తమ ప్రాజెక్ట్‌లు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, విల్లాలు, ప్లాట్స్ , కమర్షియల్ ప్రాంగణాలు ఉంటాయని వెల్లడించారు. నగరంలోని ఇతర ప్రాంతాల కంటే చౌకగా ఈ ప్రాంతంలో నివాస స్థలాలు, ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బాలానగర్, కొంపల్లి, శామీర్‌పేట, అల్వాల్, మేడ్చల్ , పటాన్‌చెరు, మొదలైన ప్రాంతాలలోని ప్రోపర్టీలు ఒకే గూటి కింద కనిపించనున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పరిశ్రమ బలమైన వృద్ధిని నమోదు చేస్తుండటంతో పాటుగా వేగంగా విస్తరిస్తుందన్నారు.

చాలా నగరాలల్లో కనిపించినట్లుగానే ఒక ప్రాంతంలో అభివృద్ధి కనిపిస్తుంది. మరీముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లో చెప్పుకోతగ్గ ప్రగతి, పెట్టుబడులు, అభివృద్ధి అనేవి సుదీర్ఘకాలంగా జరుగుతున్నాయి. అందుకే ప్రభుత్వం ఇప్పడు గ్రిడ్ ( గ్రోత్ ఇన్ డిస్పెర్షన్)పాలసీని విడుదల చేసింది. తద్వారా నగరమంతా వృద్థికి భరోసా అందిస్తుంది. గ్రిడ్ పాలసీకి అనుగుణంగా పారిశ్రామిక కారిడార్లను ప్రోత్సాహకాలు అందించి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. తద్వారా ఓఆర్‌ఆర్ వ్యాప్తంగా వృద్ధికి భరోసా అందిస్తుంది. దీనికి మద్దతును అందిస్తూ ఎస్‌ఆర్‌డిపి కింద రేడియల్ రోడ్లను అభివృద్ధి చేసి కనెక్టివిటీ మెరుగుపరుస్తుందన్నారు. వీటి కారణంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో పాటు రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ సైతం గణనీయంగా పెరుగుతుందన్నారు. జనరల్ సెక్రటరీ వి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఉత్తర భాగంలో ఈ-కామర్స్ అగ్రగామి సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి సంస్ధల వేర్‌హౌస్‌లకు నిలయంగా ప్రసిద్ధి చెందింది.

జినోమ్ వ్యాలీ, మెడికల్ డివైజస్ పార్క్‌తో పలు విద్యాసంస్థలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. గ్రిడ్ పాలసీ కారణంగా ఉత్తర హైదరాబాద్ అపూర్వంగా ప్రయోజనం పొందుతుందన్నారు. కండ్లకోయ వద్ద అతి పెద్ద ఐటీ టవర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 50వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఉత్తర కారిడార్.. హైదరాబాద్ -నాగ్ పూర్ ఇండస్ట్రీయల్ కారిడార్ (హెచ్‌ఎన్‌ఐసీ)తో హౌసింగ్ కోసం డిమాండ్ పెరుగుతోందన్నారు. ఈ కారణంతోనే ఉత్తర హైదరాబాద్ ప్రోపర్టీ షో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సమావేశంలో క్రెడాయ్ వైస్ ప్రెసిడెంట్స్ జి. ఆనంద్‌రెడ్డి, కె రాజేశ్వర్, ఎన్. జైదీప్‌రెడ్డి, బి. జగన్నాథ్‌రావు, కోశాధికారి ఆదిత్యగౌర ,జాయింట్ సెక్రటరీలు శివరాజ్ ఠాకూర్,కె. రాంబాబు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

లక్షమందికి క్రెడాయ్ నైపుణ్య శిక్షణ..

నగరంలోని భవన నిర్మాణ రంగాల్లో ఉపాధి అవకాశాలను స్థానికులకే దక్కేలా క్రెడాయ్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపడుతామని క్రెడాయ్ అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణారావు, రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు వారు సమాధానమిస్తూ.. భవన నిర్మాణ రంగంలో ఇతర రాష్ట్రాల వారే పెద్ద సంఖ్యలో ఉపాధి పొందుతున్నారని, వారితో పాటు తెలంగాణ వాసులకు అవకాశం కల్పించేలా త్వరలోనే ఐటి మంత్రి కెటిఆర్‌తో సమావేశమై.. నైపుణ్య శిక్షణ కార్యక్రమంపై చర్చించనున్నట్లు వెల్లడించారు. పదోతరగతి పూర్తిచేసిన లక్షమందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి భవన నిర్మాణ రంగంలో ఉపాధి పొందేలా క్రెడాయ్ కార్యాచరణ చేపడుతుందన్నారు. నగరంలో గృహానిర్మాణ రంగంలో పెద్దసంఖ్యలో విక్రయించకుండా ఖాళీగా ప్లాట్లు ఉన్నాయని కొన్ని పత్రికల్లో వార్తలు ప్రచురించడం సరికాదని, భవన నిర్మాణం ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు విక్రయాలు జరుగుతుంటాయని.. వాటిని పరిగణనలోకి తీసుకోవడంలో నిరాధారంగా అవాస్తవాలు ప్రచురించడం సరికాదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News