Wednesday, January 22, 2025

రాజీవ్ హత్యలో అసలు సూత్రధారులు

- Advertisement -
- Advertisement -

 

స్వతంత్ర భారతదేశంలో అనుమానాస్పద అత్యంత సంచలనం, విషాదం కలిగించిన ప్రముఖుల హత్యలలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య ఒకటని చెప్పవచ్చు. డా. శ్యామప్రసాద్ ముఖర్జీ మరణం నుండి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వరకు చెలరేగిన అనేక అనుమానాలు ప్రశ్నార్ధకంగా చరిత్రలో మిగిలిపోతున్నాయి. ప్రధాన మంత్రి పదవిలో ఉండగానే లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ మృతి చెందగా, ఆ పదవి నుండి వైదొలిగిన అనంతరం జరిగిన రాజీవ్ హత్యలకు సంబంధించిన అనేక ప్రశ్నలు ఇంకా సమాధానాలు లేకుండా మిగిలిపోతున్నాయి. వీటి వెనుక గల అసలైన కుట్రదారులు మరుగున పడిపోతున్నారు.

ముఖ్యంగా రాజీవ్ గాంధీ కేసులో తాజాగా సుప్రీంకోర్టు జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయమని ఆదేశించడంతో మరోసారి ఈ విషాదకర సంఘటన గురించి దేశ ప్రజలు మరోసారి ఆలోచించుకొనే అవకాశం ఏర్పడింది. మొదటి నుండి తీవ్రమైన రాజకీయ ఉద్రిక్తలకు దారి తీసిన ఈ రాజీవ్ హత్యకు సంబంధించిన దర్యాప్తు సక్రమంగా జరగలేదని, అందుకు వరుసగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఆసక్తి చూపలేదని భావించవలసి వస్తున్నది. ఇప్పుడు సుప్రీంకోర్టు విడుదలకు ఆదేశించిన వారెవ్వరూ రాజీవ్ హత్యకు సంబంధించిన కుట్రలో ప్రత్యక్ష ప్రమేయం గలవారు గాని, కుట్ర అమలుకు నేరుగా బాధ్యత వహించిన వారు గాని కాకపోవడం గమనార్హం. కీలకమైన శివరాసన్ బెంగళూరులో భద్రతా దళాల కాల్పులలో మృతి చెందిన తర్వాత నేరుగా ఈ కుట్రలో సంబంధం ఉన్నవారెవ్వరూ అందుబాటులో లేరు.

కేవలం ఎల్‌టిటిఇ ఆపరేషన్‌గా దీనిని చిత్రీకరిస్తూ, కొద్ది మంది శ్రీలంకకు చెందిన వారిని నిందితులుగా పేర్కొంటూ ఈ కేసును ముగించాలని హడావుడిగా దర్యాప్తు జరిగిన్నట్లు కనిపిస్తున్నది. వారికి మన దేశంలో ముఖ్యంగా అత్యున్నత స్థానాలలో ఉన్నవారిలో ఎవ్వరు సహకారం అందించారు? అనే ప్రశ్నను ఛేదించే ప్రయత్నం జరగకపోవడం గమనార్హం. బెంగళూరులో శివరాసన్‌ను చంపిన సమయంలో అతను ఆశ్రయం పొందిన ఇంట్లో సుమారు రూ. 60 లక్షల భారతీయ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వారు శ్రీలంక నుండి ఈ ఆపరేషన్ కోసం వచ్చి ఉంటే వారి వద్ద అంత పెద్ద మొత్తంలో భారతీయ కరెన్సీ ఉండే అవకాశం ఉండదు.

ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో మూలాలపై దర్యాప్తు జరిపమని తాను ఏర్పాటు చేసిన సిట్ అధిపతి కార్తికేయన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే రెండేళ్ల తర్వాత తాము ఈ విషయంలో ఎటువంటి ఆధారం పొందలేకపోయామని తమ నిస్సహాయతను సుప్రీంకోర్టుకు తెలిపారు. అంతేకాదు, ఎన్నికల ప్రచారంకు వచ్చిన రాజీవ్ గాంధీ హత్య జరిగిన సమయంలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా సమీపంలో బహిరంగ సభ వద్ద లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదని పేర్కొంటూ కాంగ్రెస్ ఒక విధంగా తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. అయితే, తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలతో పాటు సోనియా గాంధీ కుటుంబం నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకపోవటంతో వారి విడుదలకు సుప్రీం సమ్మతించడం కీలకం కానున్నది.

రాజీవ్ గాంధీ హత్యకు గురికావడానికి ఆయన భద్రతలో ఉన్న లోపాన్ని ఆ సమయంలో పలువురు వేలెత్తి చూపారు. ఆయన భద్రతను కుదించిన కారణంగా అంత తేలికగా హత్య చేయగలిగారన్నది అందరికీ తెలిసిందే. ఆయన భద్రత కుదించడానికి ప్రధాన కారకుడు నాటి ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతిగా ఉన్న ఎం కె నారాయణ సిఫార్సు కావడం ఇక్కడ గమనించాలి. అయితే, కేంద్రంలో 2004లో యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అటువంటి నారాయణను మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జాతీయ భద్రతా సలహాదారునిగా నియమించింది. ఆ పదవిలో 2010 వరకు వుండడమే కాకుండా, నాటి ప్రభుత్వంలో కీలక పాత్ర వహించారు.

అయితే 2010లో కేంద్ర హోం మంత్రిగా పి చిదంబరం రావడంతో తమిళనాడుకు చెందిన ఈ ఇద్దరి మధ్య సఖ్యత లోపించింది. దానితో నారాయణను పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమించారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. యుపిఎ ప్రభుత్వంలో ఆయనకు అంతటి ప్రాధాన్యత ఎందుకు లభించింది? రాజీవ్ గాంధీ హత్య వెనుక గల ప్రచ్ఛన్న శక్తుల బండారం బయటపెట్టకుండా ఉండేందుకే ఆ విధంగా చేశారా? మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తూ వచ్చిందే గాని, దీని వెనుక గల ప్రధాన కుట్రదారులను బయటపెట్టే ప్రయత్నం చేయలేదు. వాజపేయి, నరేంద్ర మోడీ ప్రభుత్వాలు అందుకు ఆసక్తి చూపలేదంటే అర్ధం చేసుకుంటాము. కానీ సోనియా గాంధీ కనుసన్నలలో కొనసాగిన యుపిఎ ప్రభుత్వం సహితం ఉదాసీనత ఎందుకు ప్రదర్శించింది? పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించిన దర్యాప్తు వేగంగా సాగడం లేదంటూ తరచూ సోనియాగాంధీ మద్దతుదారులు ఆరోపణలు చేస్తుండేవారు.

ఈ అంశమే పివి- సోనియాల మధ్య దూరం పెరగడానికి ఓ ప్రధాన కారణంగా కూడా చెబుతుండేవారు. ఇక, నవంబర్, 1997 లో ఐ కె గుజ్రాల్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడానికి చెప్పిన ప్రధాన కారణం రాజీవ్ గాంధీ హత్య గురించి దర్యాప్తు జరిపిన జైన్ కమిషన్ ఎల్‌టిటిఇ డిఎంకె ‘వ్యూహాత్మక మద్దతు’ ఇచ్చిన్నట్లు తన నివేదికలో పేర్కొనడమే. ఆ నివేదిక అనంతరం కూడా డిఎంకె ప్రతినిధులు గుజ్రాల్ ప్రభుత్వంలో కొనసాగడం పట్ల కాంగ్రెస్ కన్నెర్ర చేసింది. ‘డిఎంకెను తొలగించండి- దేశాన్ని రక్షించండి’ అంటూ ఆ సమయంలో కాంగ్రెస్ సభ్యులు పార్లమెంట్‌లో పెనుదుమారం రేపారు. ఈ అంశంపై గుజ్రాల్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం పట్ల నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి అంతగా ఆసక్తి చూపకపోవటాన్ని సాకుగా తీసుకొని ఆయనను ఆ పదవి నుండి బలవంతంగా దించివేసి సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుండి ఆమె గత నెల వరకు ఆ పదవిని వదలకపోవడం తెలిసిందే. మధ్యలో కొద్ది సమయం కొడుకు రాహుల్ గాంధీ ఆ పదవిలో ఉన్నారు. అప్పుడు డిఎంకె మీద కన్నెర్ర చేసిన కాంగ్రెస్ ఆ తర్వాత 2004లో ఎన్నికలు కాగానే యుపిఎలో భాగస్వామిగా చేసుకొని అధికారంలోకి రావడం వేరే సంగతి.

ఇప్పటికీ డిఎంకె యుపిఎలో భాగస్వామిగా కొనసాగడమే కాకుండా తమిళనాడులో డిఎంకె నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా కొనసాగుతున్నది. మొదటి నుండి డిఎంకె రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్నది. జైలులో ఉన్న దోషులను విడుదల చేయాలనీ స్వయంగా ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ లేఖ రాశారు. అంతకు ముందున్న ముఖ్యమంత్రులు జయలలిత, పన్నీరు సెల్వంలు సహితం వారి విడుదల కోసం లేఖలు రాసారు. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు తీర్పు పట్ల డిఎంకె నేతలు హర్షం ప్రకటిస్తుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ కేసులో కేంద్రం అభిప్రాయంతో మేం ఏకీభవించం. సోనియాగాంధీ ఉన్నత స్థాయి వ్యక్తి ఆమె అభిప్రాయాలు ఆమెవి. సోనియా అంటే మాకు చాలా గౌరవం, ఈ విషయంలో మాత్రం పార్టీ ఆమెతో ఏకీభవించదు’ అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు.

ఇప్పుడు సుప్రీంకోర్టు విడుదలకు ఆదేశించిన వారెవ్వరికీ అంతకు ముందు నేర చరిత్ర గాని, ఉగ్రవాద చరిత్ర గాని లేదు. ఈ హత్యలో కీలక సూత్రధారులు కూడా కాదు. పలువురి కథనం ప్రకారం చాలా మంది అమాయకులు. అమాయకత్వంతో ఈ కేసులో చిక్కుకొని మూడు దశాబ్దాలపాటు జైలు గోడల మధ్య గడిపారు. 1998లో టాడా కోర్టు 26 మందికి ఉరిశిక్ష విధిస్తే, చివరకు ఆరుగురు మాత్రమే జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తూ మిగలడం, వారిని కూడా ఇప్పుడు విడుదల చేయమని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడం గమనిస్తే మొత్తం దర్యాప్తు జరిగిన తీరు ప్రశ్నార్ధకంగా స్పష్టం అవుతుంది. రాజీవ్ హత్యలో అసలు సూత్రధారులను కనిపెట్టడం కోసం ఏ ప్రభుత్వం కూడా ఆసక్తి కనబరచలేదని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ హత్యను ఉపయోగించుకున్నారని భావించవలసి వస్తుంది.

* చలసాని నరేంద్ర – 9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News